ETV Bharat / bharat

యూత్ ఐకాన్: ఈ బాలికకు 13 మంది శిష్యులు

author img

By

Published : Nov 13, 2020, 7:34 PM IST

ఆన్​లైన్ తరగతులకు హాజరుకాలేని తోటి విద్యార్థులకు కేరళకు చెందిన ఓ బాలిక పాఠాలు చెబుతోంది. ఇంటి దగ్గరే స్వయంగా చదువుకొని.. ఆ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటోంది. తన ప్రయత్నానికి ప్రతిఫలంగా యుత్ ఐకాన్ అవార్డుకు ఎంపికైంది. ఎంతో మంది ప్రశంసలు అందుకుంటోంది.

Kerala girl becomes Youth icon: A teenager turns teacher, smart class facilitator for kids in a remote tribal settlement
డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తున్న పద్నాలుగేళ్ల బాలిక

ప్రజల్లో ఉన్న డిజిటల్ అంతరాలను కొవిడ్ మహమ్మారి బట్టబయలు చేసింది. ఆన్​లైన్ చదువుల కోసం ఎంతో మంది చిన్నారులకు సరైన పరికరాలు అందుబాటులో లేని విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పాఠశాలలు దాదాపుగా ఆన్​లైన్ తరగతులకే మొగ్గుచూపుతున్న నేపథ్యంలో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఈ నేపథ్యంలో ఇలాంటివారికి బాసటగా నిలుస్తోంది కేరళలోని పాలక్కడ్, అట్టపాడికి చెందిన అనామికా సుధీర్ అనే 14 ఏళ్ల బాలిక. ఆన్​లైన్ తరగతులకు హాజరుకాలేని నిరుపేద విద్యార్థుల కోసం ఉపాధ్యాయురాలి అవతారం ఎత్తింది. తాను నేర్చుకున్న కొద్దిపాటి చదువును ఇతరులతోనూ పంచుకుంటోంది. ఈ కార్యక్రమానికి 'స్మార్ట్ స్కూల్ ఇన్ మై విలేజ్'గా పేరు పెట్టింది. బాలిక చేస్తున్న కృషిని గుర్తించిన యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం... 'యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపిక చేసింది.

గుడిసెలోనే జర్మన్ భాష

ఆన్​లైన్ మాధ్యమం ద్వారా చదువుకునేందుకు అనామిక వద్ద స్మార్ట్​ఫోన్, కంప్యూటర్, టీవీ వంటివి లేవు. పాఠాలను స్వయంగా నేర్చుకొని.. తనలాంటి వారికి సహాయం చేస్తోంది. ఇంటి దగ్గర ఉన్న గుడిసెలోనే ఇతర చిన్నారులకు పాఠాలు బోధిస్తోంది. మలయాళం, హిందీ, ఇంగ్లీషు భాషలను నేర్పుతోంది. తనకు వచ్చిన కొద్దిపాటి జర్మన్​నూ ఇతరులకు చెబుతోంది. ప్రస్తుతం సుమారు 13 మందికి పాఠాలు చెబుతోంది. స్కుళ్లు తిరిగి ప్రారంభించే వరకు వీరికి ఇలాగే పాఠాలు చెబుతానని స్పష్టం చేస్తోంది.

యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు ఎందరో ప్రముఖుల నుంచి అభినందనలు అందుకుంది అనామిక. తిరువనంతపురంలోని జవహార్ నవోదయా పాఠశాలలో విద్యనభ్యసిస్తోంది. కరోనా కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఐఏఎస్ అధికారిణిగా మారి సమాజానికి సేవ చేయడమే తన ధ్యేయమని చెబుతోంది.

ఇదీ చదవండి- విపత్తు సాయం కింద 6 రాష్ట్రాలకు రూ.4,382 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.