ETV Bharat / bharat

'మేం ఐక్యంగానే ఉన్నాం.. రాహుల్, ఖర్గేలకు ఆ మాటిచ్చాం!'

author img

By

Published : May 18, 2023, 12:59 PM IST

karnataka new cm
ఖర్గేతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్

Karnataka New CM : కర్ణాటక రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు.

కర్ణాటక సీఎం ఎంపికపై చిక్కుముడి వీడింది. ముఖ్యమంత్రి పదవి తప్ప మరే స్థానం అవసరం లేదని పట్టుబట్టిన కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ రాజీకొచ్చారు. దీంతో కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ పేరును కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించారు డీకే శివకుమార్. 'రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో మేం ఐక్యంగా ఉన్నాం' అని ఆయన ట్వీట్ చేశారు. కలిసి పని చేయాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తమకు సూచించారని డీకే.. విలేకరులతో పేర్కొన్నారు. దానికి తాము అంగీకరించినట్లు చెప్పారు. అంతా సవ్యంగానే ఉందని, ఇకపైనా ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు.

karnataka new cm
ఖర్గేతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్

'సంతోషంగా లేను..'
అంతకుముందు.. డీకే శివకుమార్‌ ఉపముఖ్యమంత్రి పదవికే పరిమితం అవ్వనున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన సోదరుడు కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌ స్పందించారు. ఈ పరిణామాల పట్ల తాను పూర్తి సంతోషంగా లేనని తెలిపారు. తన సోదరుడు సీఎం అవ్వాలని తాను భావించినా అది జరగలేదన్నారు. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని.. అందుకే భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూసే ధోరణితో ఉన్నట్లు తెలిపారు.

"నేను పూర్తి సంతోషంగా లేను. కానీ కర్ణాటక ప్రయోజనాల దృష్ట్యా, మేము మా వాగ్దానాలను నెరవేర్చాల్సి ఉంది. అందుకే ఈ పరిణామాలను డీకే శివకుమార్‌ అంగీకరించాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. నేను శివకుమార్‌ను సీఎంగా చూడాలనుకున్నాను. కానీ అది జరగలేదు. మేము వేచి చూస్తాం."
-డీకే సురేష్‌, కాంగ్రెస్‌ ఎంపీ

పార్టీ ప్రయోజనాల దృష్ట్యా డీకే శివకుమార్​ సీఎం పదవిపై వెనక్కి తగ్గి.. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు అంగీకరించారని గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. డీకే శివకుమార్​, సిద్ధరామయ్యతో భేటీ అయ్యి సీఎం పీఠంపై ఏకాభిప్రాయం కుదిర్చినట్లు పేర్కొన్నాయి. మే 20న ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారని వెల్లడించాయి. 20 నుంచి 25 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.

కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం గురువారం బెంగళూరులో జరగనుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సమాచారం పంపారు. గురువారం రాత్రి 7 గంటలకు ఇందిర భవన్‌లో సీఎల్పీ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. సీఎల్పీ భేటీలోనే కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా సిద్ధరామయ్యను ఎన్నుకోనున్నారు.

సిద్ధరామయ్య ఇంటి వద్ద సంబరాలు..
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసం వద్ద మిఠాయిలు పంచి బాణసంచా కాల్చారు. సీఎం సిద్ధరామయ్య అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సిద్ధరామయ్య నివాసంతో పాటు బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అంటూ పెద్దపెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఫలితాలు ఇలా..
Karnataka Election Results 2023 : మే 10న జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. 35 ఏళ్ల తర్వాత ఈ స్థాయి మెజార్టీ రావటం ఇదే మొదటిసారి. భారతీయ జనతా పార్టీ 66 స్థానాలు, దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్‌ 19స్థానాల్లో గెలుపొందాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.