5 ఉచిత హామీల అమలుకు సిద్ధూ సర్కార్​ గ్రీన్​ సిగ్నల్!.. ఏడాదికి రూ.50వేల కోట్ల ఖర్చు..

author img

By

Published : May 20, 2023, 7:55 PM IST

Karnataka Congress Schemes

Congress Five Guarantees : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ ప్రకటించిన ఐదు ఉచిత హామీల అమలుకు సిద్ధరామయ్య ప్రభుత్వం.. తొలి కేబినెట్​ సమావేశంలోనే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ. 50,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

Karnataka Congress Schemes : కర్ణాటకలో కాంగ్రెస్​ ఘన విజయానికి దోహదం చేసిన ఐదు ఉచిత హామీల అమలుకు సిద్ధరామయ్య ప్రభుత్వం.. తొలి కేబినెట్ సమావేశంలోనే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వాటి అమలుకు ఏటా రూ.50,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. శనివారం ఉదయం.. కొత్త సీఎంగా సిద్ధరామయ్య, ఏకైక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎనిమిది మంది మంత్రులతో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సిద్ధూ ప్రభుత్వం. అనంతరం సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు తెలిపారు.

Congress Five Guarantees : "మేనిఫెస్టోలో 5 హామీలు ఇచ్చాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే వాటి అమలుపై చర్చించి, ఆదేశాలు ఇచ్చాం. వారం రోజుల్లో మరో కేబినెట్ సమావేశం నిర్వహించి వాటికి ఆమోదం తెలుపుతాం. ఆర్థికపరమైన చిక్కులు వచ్చినప్పటికీ.. కన్నడ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మా ప్రభుత్వం సంవత్సరానికి రూ.50,000 కోట్లు.. ఐదు హామీల కోసం ఖర్చు చేయడం అసాధ్యమని నేను అనుకోను. అప్పుల ఊబిలో కూరుకుపోకుండా అన్ని పథకాలను అమలు చేస్తామన్న విశ్వాసం మాకు ఉంది. రాష్ట్ర రుణానికి వడ్డీగా రూ.56,000 కోట్లు చెల్లిస్తున్నప్పుడు.. మన ప్రజల కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేయలేమా?" అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. జులైలో రూ.3.25 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడతామని సిద్ధరామయ్య తెలిపారు.

Karnataka Congress Schemes
డీకే శివకుమార్​, సిద్ధరామయ్య

కాంగ్రెస్ ప్రకటించిన 5 హామీలు

  1. గృహ జ్యోతి: కర్ణాటకలోని ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
  2. గృహ లక్ష్మి: కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000
  3. అన్న భాగ్య: దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ప్రతి నెల 10 కిలోల బియ్యం
  4. యువ నిధి: నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ప్రతి నెల రూ.3,000 భృతి, డిప్లోమా ఉండి ఉద్యోగం లేని వారికి ప్రతి నెల రూ.1,500.
  5. శక్తి: కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు

సోమవారం నుంచే కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు..
మే 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆ సమావేశాల్లోనే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించి.. స్పీకర్‌ను ఎన్నుకుంటామని వెల్లడించారు. "మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే ఆర్‌వీ దేశ్‌పాండే.. ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు" అని సిద్ధూ చెప్పారు.

Karnataka Congress Schemes
ప్రమాణస్వీకారం చేస్తున్న సిద్ధరామయ్య

బొమ్మై నేమ్​ బోర్డు తొలగింపు
సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం అనంతరం విధానసౌధలోని సీఎం గది బయట ఉన్న మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేరుతో ఉన్న నేమ్​ బోర్డును అధికారులు తొలగించారు. ఆ స్థానంలో సిద్ధరామయ్య పేరుతో నేమ్‌ బోర్డును ఏర్పాటు చేశారు. పూలమాలలతో అలకరించారు.

Karnataka Congress Schemes
సిద్ధరామయ్య నేమ్​ బోర్డ్

సిద్ధూ, డీకేలు మోదీ విషెస్​
కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ పాలనాకాలం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని ట్వీట్‌ చేశారు.

'సిద్ధూ హైకమాండ్​ కీలుబొమ్మ.. రబ్బర్​ స్టాంప్​ సీఎం'
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్​ కటీల్​ విమర్శలు గుప్పించారు. కొత్త ముఖ్యమంత్రి మొదటి రోజు నుంచే కాంగ్రెస్ హైకమాండ్‌కు కీలుబొమ్మగా మారారని కటీల్ విమర్శించారు. "కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ సిద్ధరామయ్యకు లేదనడానికి కేసీ వేణుగోపాల్​ లేఖ నిదర్శనం. సోషలిస్టు సిద్ధాంతాలను విశ్వసించే సిద్ధరామయ్య తొలిరోజు నుంచే కాంగ్రెస్ హైకమాండ్ కీలుబొమ్మగా మారారు. ఆయన రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి అయ్యారు" అని కటీల్ ట్వీట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.