ETV Bharat / bharat

రాహుల్​ గాంధీకి మరో ఎదురుదెబ్బ.. మరో 3 కేసుల్లో విచారణకు రావాలంటూ సమన్లు

author img

By

Published : Mar 26, 2023, 8:56 PM IST

jharkhand high court
jharkhand high court

లోక్​సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్​ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో 3 కేసుల్లో విచారణకు హాజరు కావాలని కోరుతూ ఝార్ఖండ్​ దిగువ కోర్టులు సమన్లు జారీ చేశాయి. మోదీ వంశంపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఓ కేసు నమోదు కాగా.. అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గానూ మిగిలిన రెండు కేసులు నమోదయ్యాయి.

కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి ఝార్ఖండ్​ దిగువ కోర్టులు సమన్లు జారీచేశాయి. పరువునష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడి.. లోక్​సభలో అనర్హత వేటు పడిన రాహుల్​ను.. మరో 3 కేసుల్లో విచారణకు రావాలని కోరుతూ దిగువ కోర్టులు సమన్లు జారీ చేశాయి. వీటిలో ప్రదీప్​​ మోదీకి సంబంధించి ఒక కేసు కాగా.. కేంద్ర మంత్రి అమిత్​ షాపై చేసిన వ్యాఖ్యలకు గాను మిగిలిన రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ 1, 3, 5 తేదీల్లో విచారణకు రావాలంటూ రాహుల్​కు కోర్టులు సమన్లు జారీ చేశాయి.

2021లో ప్రదీప్​ మోదీ.. దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఏప్రిల్​ 1న విచారణకు హాజరుకావాలని రాంచీలోని దిగువ కోర్టు రాహుల్​ గాంధీకి సమన్లు జారీ చేసింది. ప్రదీప్​ మోదీ నమోదు చేసిన పిటిషన్​ను గతంలో రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు రాజేశ్​ ఠాకూర్​ హైకోర్టులో సవాలు చేశారు. అయితే రాజేశ్​ ఠాకూర్​ చేసిన అభ్యర్థనను జనవరి 17న హైకోర్టు తిరస్కరించింది. దీంతో లోయర్ కోర్టు ఏప్రిల్​ 1న ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని రాహుల్​ గాంధీకి సమన్లు జారీ చేసింది. 2019లో ఝార్ఖండ్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్​ గాంధీ 'మోదీలందరూ దొంగలని' అన్నారు. ప్రదీప్​ మోదీ కాంగ్రెస్​ పార్టీకి భూమిని విరాళంగా ఇచ్చిన కుటుంబానికి చెందిన వారు. రాహుల్ చేసిన ఆ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ ప్రదీప్ మోదీ దిగువ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. మోదీ వంశంపై చేసిన ఇదే తరహా వ్యాఖ్యలకు గానూ.. సూరత్ కోర్టు రాహుల్​ను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో తన కేసును కూడా త్వరగా విచారించాలని ప్రదీప్​ మోదీ కోర్టును కోరారు.

మిగిలిన రెండు కేసులు రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు, చైబాసా కోర్టులో నమోదైయ్యాయి. నవీన్​ ఝా, ప్రదీప్​ కుమార్​ అనే పిటిషనర్లు ఈ రెండు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. 2018లో కాంగ్రెస్​ సమావేశంలో మాట్లాడిన రాహుల్​ గాంధీ.. అమిత్​ షా 'హంతకుడు' అని అన్నారు. దీంతో నవీన్​ ఝా, ప్రదీప్​ కుమార్​లు​ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే నవీన్ ఝా పిటిషన్‌ను ఏప్రిల్ 5న, ప్రదీప్ కుమార్​ పిటిషన్​ను ఏప్రిల్ 3న విచారించనున్నాయి.

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ 'దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?' అని వ్యాఖ్యానించారంటూ గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ గుజరాత్​లోని సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీంతో ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్షను విధించింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఆధారంగా చేసుకుని లోక్​సభ రాహుల్​పై అనర్హత వేటు వేసింది. అయితే, ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడినవారికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా లోక్‌సభ సచివాలయం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహాల్​కు రెండేళ్ల జైలు శిక్షాకాలంతో పాటుగా మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారు. దీంతో లోక్​సభ సభ్వత్వాన్ని కోల్పోయిన రాహుల్​కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణులు పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేపట్టాయి. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడి రాహుల్​ గాంధీ గొంతును అణిచివేసేందుకే అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.