ETV Bharat / bharat

కొత్త ముష్కరులపై ఉక్కుపాదం.. సగం మంది 6నెలల్లోపే హతం!

author img

By

Published : Jul 4, 2022, 7:28 AM IST

KASHMIR TERRORISM REPORT: జమ్ము కశ్మీర్​లో ముష్కరులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్రవాదం వైపు మళ్లుతున్న యువతలో అధిక మంది తొలి ఏడాదిలోనే హతమవుతున్నట్లు తేలింది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో భద్రతా దళాల చేతిలో 90 మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు నివేదికలో అధికారులు వెల్లడించారు. అందులో 26 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు స్పష్టం చేశారు.

JAMMU KASHMIR TERRORISM
JAMMU KASHMIR TERRORISM

KASHMIR TERRORISM KILLINGS: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదానికి సంబంధించి ఆసక్తికరమైన నివేదికను అధికారులు విడుదల చేశారు. ఇందులో కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. ఉగ్రవాదం వైపు మళ్లుతున్న యువతలో అత్యధికులు తొలి ఏడాదిలోనే హతమవుతున్నారు. ఈ శాతం 64.1గా ఉందని తెలిపారు. బలమైన క్షేత్రస్థాయి నిఘా వ్యవస్థతో ఇందులో 28.1% మందిని తొలి నెలలోనే భద్రతా బలగాలు అంతమొందిస్తుండగా, 54.7 శాతాన్ని తొలి ఆరు నెలల్లో, 59.4 శాతాన్ని తొమ్మిది నెలల్లో ఏరివేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1-మే 31 మధ్య ఈ డేటా సేకరించినట్లు అధికారులు తెలిపారు.

పాక్‌ ఉగ్రవాదులే అత్యధికం
కశ్మీర్‌ లోయలో పాక్‌ ఉగ్రవాదుల చొరబాట్లు ఇటీవల భారీగా పెరుగుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో భద్రతా దళాల చేతిలో 90 మంది ముష్కరులు మృతి చెందితే.. అందులో 26 మంది పాక్‌ జాతీయులే కావడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపించింది. నిరుడు మొత్తం 182 మంది ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లో భద్రతాదళాలు మట్టుబెడితే అందులో 20 మంది మాత్రమే విదేశీయులు.

లష్కరే టాప్‌
తొలి ఐదు నెలల్లో 90 మంది ఉగ్రవాదులు చనిపోతే అందులో అత్యధికం లష్కరే తోయిబా నుంచే ఉన్నారు. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన 52 మందిని భారత భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. తర్వాత స్థానాల్లో జైషే మొహమ్మద్‌ (20), హిజ్బుల్‌ ముజాహిదీన్‌ (11), అల్‌బద్ర్‌ (4) ఉన్నాయి.

పిస్టల్స్‌ పెరిగాయ్‌
సాధారణంగా ఉగ్రవాదులు ఎక్కువగా ఏకే-47 లాంటి మారణాయుధాలు వాడతారు. అయితే ప్రస్తుతం లోయలో పిస్టళ్ల వాడకం పెరిగింది. భద్రతా బలగాలు ఈ ఏడాది తొలి 5 నెలల్లో 350 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని చంపడం ఇటీవల ఎక్కువైందని.. అందుకే పిస్టళ్ల సంఖ్య పెరిగిందని అధికారులు అంటున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.