ETV Bharat / bharat

'గాంధీ LAW పట్టా పొందలేదు'.. కశ్మీర్​ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

author img

By

Published : Mar 24, 2023, 7:58 PM IST

jk governor comments on mahatma gandhi law degree
గాంధీ లా పట్టాపై జమ్ముకశ్మీర్ గవర్నర్​ వ్యాఖ్యలు

జాతిపిత మహాత్మ గాంధీ విద్యార్హతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జమ్ముకశ్మీర్ లెఫ్టినంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా. గాంధీ.. న్యాయశాస్త్రంలో అధికారికంగా ఎలాంటి పట్టా పొందలేదని.. అయినా విద్యావంతులయ్యారని వ్యాఖ్యానించారు.

జాతిపిత మహాత్మ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జమ్ముకశ్మీర్ లెఫ్టినంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా. గాంధీ.. న్యాయశాస్త్రంలో అధికారికంగా ఎలాంటి పట్టా పొందలేదని.. అయినా విద్యావంతులయ్యారని వ్యాఖ్యానించారు. చేతిలో డిగ్రీ పట్టాలు ఉన్నంత మాత్రాన ఓ వ్యక్తి విద్యావంతుడు కారని అభిప్రాయపడ్డారు. అలా అయితే మహాత్ముడు అభ్యసించిన న్యాయశాస్త్రంలో అధికారికంగా ఎలాంటి పట్టా తీసుకోలేదని.. అయినప్పటికీ గొప్పవారు ఎలా అయ్యారని గవర్నర్ మనోజ్​ సిన్హా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో సిన్హా ప్రస్తావించారు.

"బయట అందరూ గాంధీజీ న్యాయశాస్త్ర పట్టా పొందారని అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ఆయనకు ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని మీకు తెలుసా..? ఆయన ఏకైక విద్యార్హత హైస్కూల్ మాత్రమే. గాంధీజీ లా ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించిన మాట వాస్తవమే కానీ అందులో న్యాయ పట్టా పొందలేదు. ఆయనకు ఎటువంటి డిగ్రీ లేదు. కానీ గొప్ప విద్యావంతులయ్యారు గాంధీ"

--మనోజ్​ సిన్హా, జమ్ముకశ్మీర్ లెఫ్టినంట్​ గవర్నర్​

ఈ వాస్తవాన్ని చాలా మంది విద్యావంతులు వ్యతిరేకించవచ్చని అన్నారు మనోజ్ సిన్హా. కానీ, గాంధీకి అధికారికంగా న్యాయ పట్టా లేదన్న విషయాన్ని కచ్చితంగా చెప్పగలనని ఆయన చెప్పారు. గాంధీ జీవితంలో సత్యమే ఆయుధంగా ముందుకు నడిచారని.. చివరిక్షణాల వరకు ఆయన దానిని విడిచిపెట్టలేదని సిన్హా తెలిపారు. గాంధీజీ దేశం కోసం చాలా చేశారని.. ఆయన సాధించిన ప్రతిదానికీ సత్యమే కేంద్ర బిందువయిందని.. అందుకే మహాత్ముడు జాతిపిత అయ్యారని గవర్నర్​ కొనియాడారు. అయితే గవర్నర్​ చేసిన వ్యాఖ్యలు కొందరు తప్పుపడుతుంటే.. గొప్ప విద్యావంతులవ్వడానికి డిగ్రీలతో సంబంధం లేదని గవర్నర్​ ఉద్దేశం అని మరికొందరు సమర్థిస్తున్నారు.

కాగా, గాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్​ లండన్ నుంచి లా పట్టా పొందిన సంగతి తెలిసిందే. మహాత్మ గాంధీ రచించిన 'ది లా అండ్ ది లాయర్స్' పుస్తకంలోని మొదటి విభాగంలో 'గాంధీజీ యాజ్ ఎ లా స్టూడెంట్' అని, రెండవ విభాగంలో 'గాంధీ ఏ లాయర్' అనే శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి.

30 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సినిమా హాళ్లు..
జమ్ముకశ్మీర్​ గవర్నర్​ ఇలా నోరు జారడం పక్కనపెడితే. 2020 ఆగస్ట్​లో ఆయన జమ్ముకశ్మీర్ గవర్నర్​గా నియమితులయ్యారు. దాదాపు మూడు దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్​లో మూతపడ్డ సినిమా హాళ్లను గతేడాది సెప్టెంబరులో తిరిగి తెరిపించింది అక్కడి ప్రభుత్వం. వీటిని స్వయంగా గవర్నర్​ సిన్హా ప్రారంభించారు. వీటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు సిన్హా. భవిష్యత్​లో జమ్ములోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్​ను నెలకొల్పుతామని సిన్హా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.