ETV Bharat / bharat

కోర్టులో టిప్పులు.. యూనిఫాంపై క్యూఆర్‌ కోడ్‌తో బిళ్ల బంట్రోతు వసూళ్లు

author img

By

Published : Dec 2, 2022, 7:51 AM IST

న్యాయవాదుల నుంచి టిప్పులు స్వీకరిస్తున్న ఓ జమేదారు(బిళ్ల బంట్రోతు)ను అధికారులు సస్పెండ్‌ చేశారు. కోర్టుకు వచ్చే న్యాయవాదులను టిప్పు అడుగుతూ, నగదు లేదనే వారి నుంచి డబ్బు రాబట్టేందుకు యూనిఫాంపైన పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. వైరలైన ఫొటో చూసిన అధికారులు.. అతనిపై చర్యలు తీసుకున్నారు.

jamedar receiving tips from lawyers
న్యాయవాదుల నుంచి టిప్పులు స్వీకరిస్తున్న జమేదారు

యూనిఫాంపైనే పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ అమర్చుకుని మరీ న్యాయవాదుల నుంచి టిప్పులు స్వీకరిస్తున్న ఓ జమేదారు(బిళ్ల బంట్రోతు)ను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టులో రాజేంద్ర కుమార్‌ అనే వ్యక్తి ఓ జడ్జికి బిళ్ల బంట్రోతుగా పని చేస్తున్నారు. కోర్టుకు వచ్చే న్యాయవాదులను టిప్పు ఇవ్వాలని అడిగేవాడు. నగదు లేదని చెప్పేవారి నుంచి ఎలాగైనా డబ్బు రాబట్టేందుకు యూనిఫాంపైన పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ధరించి నిర్భయంగా కోర్టులో సంచరించేవాడు.

అయితే ఇటీవల యూనిఫాంపైన పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఫొటో ఒకటి వైరల్‌ అయింది. అందులో రాజేంద్ర కుమార్‌ ముఖం కనిపించనప్పటికీ ఈ విషయం చర్చనీయాంశం అయింది. రాజేంద్ర కుమార్‌ గురించి తెలిసిన న్యాయమూర్తి జస్టిస్‌ అజిత్‌ కుమార్‌ ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయగా ఆయన ఈ విషయంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దర్యాప్తులో రాజేంద్ర కుమార్‌ బాగోతం బయటపడటంతో అధికారులు అతణ్ని సస్పెండ్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.