ETV Bharat / bharat

ISRO Exam Cheating Case : ఎగ్జామ్​ కోసం స్పెషల్​ షర్ట్.. బటన్​లో కెమెరా.. ఇస్రో జాబ్​ కోసం హైటెక్​ కాపీయింగ్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 4:32 PM IST

Isro Exam Cheating Case
Isro Exam Cheating Case

ISRO Exam Cheating Case : ఇస్రోలోని ఓ సంస్థ చేపట్టిన పరీక్షల్లో అత్యాధునిక సాంకేతికత సహాయంతో చీటింగ్​కు పాల్పడ్డారు అభ్యర్థులు. వీటికోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ వస్తువుతో పాటు కెమెరాలు కనిపించకుండా దుస్తులను తయారు చేశారు.

ISRO Exam Cheating Case : కేరళలో ఇస్రో ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల చీటింగ్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 'విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం' (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి చీటింగ్ చేశారు కొందరు అభ్యర్థులు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఎలక్ట్రానిక్ వస్తువును రూపొందించారు. దీంతో పాటు కెమెరా లెన్స్​లు కనపడకుండా ఉండేలా దుస్తులను ప్రత్యేకంగా కుట్టించారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ చీటింగ్​ జరిగిందని పోలీసులు వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన తిరువనంతపురం పోలీస్ కమిషనర్ నాగరాజు.. కేసు వివరాలను వివరించారు. బటన్‌లో పెట్టిన కెమెరాలతో ప్రశ్నలను స్కాన్‌ చేసి ఎక్కడికో పంపించి, చెవిలో అమర్చుకున్న పరికరంతో సమాధానాలు విని పరీక్షలు రాశారని చెప్పారు. ఆ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపిస్తామని వివరించారు. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు హరియాణావాసులను అరెస్ట్ చేసినట్లు కమిషనర్​ చెప్పారు.

"ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ వస్తువుతో పాటు ఇయర్​ పీస్​, కెమెరా లెన్స్​లు ఉపయోగించారు. కెమెరా లెన్స్​లు కనిపించకుండా ఉండేందుకు చొక్కా బటన్లలో వీటిని పెట్టారు. వీరి నైపుణ్యం చూస్తే.. తొలిసారి చేసిన వాళ్లు కాదని.. ఇప్పటికే అనేక సార్లు చేసినట్లు అర్థం అవుతోంది. ఈ ఎలక్ట్రానిక్ వస్తువు ఏ బ్రాండ్​కు చెందినవి కావు. వీటిని ప్రత్యేకంగా దీనికోసమే ఓ సాంకేతిక నిపుణుడి సాయంతో రూపొందించారు. ఈ కేసు భారీ నగదుతో ముడిపడి ఉంది. నిందితులు పరీక్షకు ముందురోజు విమానంలో వచ్చారు. వీరంతా పక్కా ప్రణాళికతో ఇక్కడకు వచ్చారు."

--నాగరాజు, తిరువనంతపురం పోలీస్ కమిషనర్

VSSC Exam Cancel : మరోవైపు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన 'విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం' (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాతపరీక్షను రద్దుచేశారు అధికారులు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తూ మోసగించారనే ఆరోపణలపై హరియాణాకు చెందిన ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీనిపై అప్రమత్తమైన కేరళ పోలీసులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించగా.. ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు వీఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. రేడియోగ్రాఫర్‌-ఏ, టెక్నీషియన్‌-బి, డ్రాఫ్ట్స్‌మేన్‌-బి, పోస్టుల కోసం మళ్లీ ఎప్పుడు పరీక్షలు జరిగేదీ వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటిస్తామని వెల్లడించింది.

VSSC Exam Cheating Case : ఈ జాతీయస్థాయి పరీక్షను ఒక్క కేరళలోనే 10 కేంద్రాల్లో నిర్వహించారు. ఒకరికి బదులుగా పరీక్షలు రాస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరితోపాటు హరియాణాకు చెందిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక్క హరియాణా నుంచే 400 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావడం వల్ల కోచింగ్‌ కేంద్రాల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని నిగ్గు తేల్చడానికి కేరళ నుంచి పోలీసుల బృందం హరియాణాకు వెళ్లనుంది.

గ్రూప్‌-1 పరీక్షలో చీటింగ్.. మొబైల్‌లో చూస్తూ కాపీయింగ్

'మాయా అద్దం'.. మోసపోయిన 72 ఏళ్ల వృద్ధుడు.. వారిని నగ్నంగా చూడొచ్చని రూ.9 లక్షలు వసూలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.