Islamic radicals in Hyderabad : హిందువు నుంచి ఇస్లామిక్ రాడికల్స్​గా.. జిహాద్ సాహిత్యమే ప్రేరణ

author img

By

Published : May 11, 2023, 7:08 AM IST

islamic radicals in hyderabad

Islamic radicals in Hyderabad : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుంచి విడిపోయిన కొంత మంది కార్యకర్తలు ఇస్లామిక్ రాడికల్స్‌గా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారుల నిఘాలో బయటపడింది. ఈ మేరకు భోపాల్‌తో పాటు హైదరాబాద్‌లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఆయా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారులను అప్రమత్తం చేయడంతో 17మంది ఇస్లామిక్ కార్యకర్తల బాగోతం బయటపడింది. ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

Islamic radicals in Hyderabad : హైదరాబాద్‌లో ఆరుగురు ఇస్లామిక్ రాడికల్స్ పట్టుబడటంతో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. నిందితుల్లో భోపాల్‌కు చెందిన మహ్మద్ సలీం, ఒడిశాకు చెందిన అబ్దుర్ రహమాన్‌తో పాటు నగరానికి చెందిన ఆరుగురున్నారు. ముగ్గురు నిందితులు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారి, ఆ తర్వాత ఇస్లామిక్ రాడికల్స్‌గా మారడం గురించి ఆరా తీస్తున్నారు. భోపాల్ కు చెందిన సౌబర్ రాజ్ వైద్య.. 2010లో ఇస్లాం మతంలోకి మారి మహ్మద్ సలీంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. వివాహం అయిన తర్వాత కొన్నాళ్లకు ముస్లింగా మారిన సలీం... ఆ తర్వాత తన భార్యను కూడా మతం మార్చినట్లు గుర్తించారు. 2018లో హైదరాబాద్‌కు వచ్చిన సలీం దంపతులు... గోల్కొండలో ఉంటున్నట్లు తేల్చారు.

హైదరాబాద్​లో ఇస్లామిక్ రాడికల్స్ : ఒడిశాకు చెందిన దేవిప్రసాద్ సైతం అబ్దుల్ రహమాన్‌గా మారాడని... క్లౌడ్ సర్వీస్ ఇంజినీర్‌గా పనిచేస్తూ సలీం ఉన్న కాలనీలోనే నివాసం ఉంటున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న సల్మాన్‌ను సైతం కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకొని మధ్యప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులకు అప్పజెప్పారు.

జవహర్‌నగర్, బాలాజీనగర్‌లోని శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న సల్మాన్... టీవీ, సెల్‌ఫోన్ మరమ్మతులు చేస్తున్నట్లు అతని సోదరి తెలిపారు. జగద్గిరిగుట్టకు చెందిన మహ్మద్ హమీద్, సల్మాన్ స్నేహితులను పోలీసులు గుర్తించారు. సల్మాన్ ద్వారా హమీద్ ఇస్లామిక్ రాడికల్‌గా మారినట్లు గుర్తించారు. సల్మాన్ ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరాల డేటాను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని, ఆయన ఇంటికి ఎవరెవరు వచ్చిపోయారనే వివరాలు సేకరిస్తున్నారు.

తీవ్రవాదం వ్యాప్తి : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన కార్యకర్తలు కొత్త సంస్థ ఏర్పాటు చేసి ఇస్లాం తీవ్రవాదం వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు నిఘా వేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు... భోపాల్‌ సహా హైదరాబాద్‌లోనూ ఇస్లామిక్ రాడికల్స్ ఉన్నట్లు గుర్తించారు. భోపాల్‌కు చెందిన 11మంది, హైదరాబాద్‌కు చెందిన ఏడుగురితో కలిసి దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రకుట్రలకు సిద్ధమైనట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నారు.

భోపాల్, హైదరాబాద్‌లో ఆ మేరకు ఉగ్ర చర్యలకు పాల్పడే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ లోపే అప్రమత్తమై ఇస్లామిక్ రాడికల్స్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో వాళ్లలో ఏమాత్రం పశ్చాతాపం కనపడలేదని పోలీసులు చెబుతున్నారు. నిందితులంతా ఇస్లామిక్ జీహాద్ సాహిత్యం చదివి ఎంతో ప్రభావితమైనట్లు గుర్తించారు. ఆ మేరకు దేశవ్యాప్తంగా ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

నిందితుల స్నేహితులు, పరిచయస్థులపైనా కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. ఈ ఆరుగురు ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడరనే వివరాలు సేకరిస్తున్నారు. వాళ్లు ఉపయోగించిన సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కాల్ డేటాపై కూడా పోలీసులు నిఘా పెట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.