ETV Bharat / bharat

Third Wave: 'అలా చేస్తే.. కరోనా 3.0 తప్పదు'

author img

By

Published : Jun 5, 2021, 6:42 AM IST

Updated : Jun 5, 2021, 8:25 AM IST

కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేదంటే మరో ఉద్ధృతి(Third Wave) తప్పదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ హెచ్చరించారు. రెండో ఉద్ధృతిలో పిల్లలకు సంక్రమణ ముప్పేమీ పెరగలేదని అన్నారు.

containment measures slackens, cases can rise again
కరోనా నిబంధనలపై వీకే పాల్​ వ్యాఖ్యలు

ప్రజలంతా కొవిడ్‌ నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తుండటంతో ప్రస్తుతం దేశంలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. ఇదే ప్రవర్తనను జనం ఇకముందూ కొనసాగించాలని.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పరిస్థితులు మళ్లీ మొదటికొస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా గత డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిల్లో మాదిరిగా వ్యవహరిస్తే.. మూడో ఉద్ధృతి(Third Wave) తప్పదన్నారు. శుక్రవారం ఆయన విలేకర్లతో పలు అంశాలపై మాట్లాడారు.

''ప్రజలు కొవిడ్‌ నిబంధనలను ఇప్పుడు చక్కగా పాటిస్తున్నారు. ఆ ప్రవర్తనను మార్చుకుంటే మళ్లీ కేసులు అకస్మాత్తుగా పెరుగుతాయి. కాబట్టి ప్రస్తుత అలవాట్లను మార్చుకోవడంలో చాలా నిదానంగా వ్యవహరించాలి. అప్పుడు మరో ఉద్ధృతి రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా.. అది స్వల్ప స్థాయిలో ఉండొచ్చు. దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలకు టీకా అందించేంతవరకు మాస్కు, భౌతికదూరం వంటి నిబంధనలను పాటించాలి. ఇవన్నీ పాటిస్తే వ్యాక్సిన్ల పంపిణీకి మనకు మరింత సమయం చిక్కుతుంది.''

- వీకే పాల్​, నీతి ఆయోగ్​ సభ్యుడు

అమెరికాను మించి టీకా పంపిణీ

కనీసం ఒక డోసు టీకా పొందినవారి సంఖ్య అమెరికా కంటే మన దేశంలోనే ఎక్కువ. భారత్‌లో ఇప్పటివరకు 17.2 కోట్ల మందికి తొలి డోసు అందించగా, అమెరికాలో ఆ సంఖ్య 16.9 కోట్లుగానే ఉంది. దేశవ్యాప్తంగా 60 ఏళ్లు దాటినవారిలో 43% మందికి, 45 ఏళ్లు పైబడినవారిలో 37% మందికి ఇప్పటివరకు కనీసం ఒక డోసు అందింది. 60 ఏళ్లు దాటినవారికి టీకా పంపిణీలో తెలంగాణ (39%), పంజాబ్‌ (35%) కాస్త వెనుకబడి ఉన్నాయి. ఈ నెలలో వ్యాక్సిన్ల లభ్యత పెరగనుంది. కాబట్టి పంపిణీ వేగం పుంజుకుంటుంది.

పిల్లల్లో సంక్రమణ పెరగలేదు

రెండో ఉద్ధృతిలో పిల్లలకు సంక్రమణ ముప్పేమీ పెరగలేదు. మొదటి ఉద్ధృతిలో సీరో సర్వేలో పెద్దల్లో 24% సీరో పాజిటివిటీ రేటు కనిపించింది. అప్పుడు పిల్లల్లోనూ 22-23%గా ఉంది. పిల్లలపై కొవాగ్జిన్‌, జైడస్‌ టీకాల వినియోగానికి సంబంధించి ప్రస్తుతం ప్రయోగాలు కొనసాగుతున్నాయి. మన దేశంలో 12-18 ఏళ్ల మధ్య వయసు వారికి టీకా వేయాలంటే దాదాపు 25 కోట్ల డోసులు అవసరమవుతాయి.

68 శాతం కేసులు తగ్గాయి..​

దేశంలో మే 7న నమోదైన రికార్డు స్థాయి కేసులతో పోలిస్తే ప్రస్తుతం 68శాతం మేర కేసులు క్షీణించాయని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతుందన్న ఆయన 60ఏళ్లు పైబడిన 43శాతం మందికి, 45 నుంచి 60ఏళ్ల మధ్య ఉన్న 37శాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:టీకా వృథాను అరికట్టాలి: మోదీ

టీకా తర్వాత వైరస్‌ సోకినా.. ముప్పు తక్కువే!

Last Updated :Jun 5, 2021, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.