ETV Bharat / bharat

మళ్లీ కొవిడ్ బుసలు.. 149 రోజుల తర్వాత భారీగా కేసులు.. ఏడుగురు మృతి

author img

By

Published : Mar 26, 2023, 11:36 AM IST

India Covid cases
India Covid cases

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 1,890 కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. 149 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కరోనా వ్యాప్తిపై రోజువారీ గణాంకాలు విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో ఏకంగా 1890 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 149 రోజుల తర్వాత ఇదే ప్రథమం. గతేడాది అక్టోబర్​ 28న 2,208 కేసులు వెలుగులోకి వచ్చాయి.

  • కొత్త కేసులు పెరిగిన నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య సైతం అధికమైంది. ప్రస్తుతం 9,433 మంది కరోనాతో బాధపడుతున్నారు.
  • శనివారం కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కొవిడ్​తో చనిపోయిన వారి సంఖ్య 5,30,831కు పెరిగింది.
  • కొత్త మరణాల్లో మహారాష్ట్ర, గుజరాత్​లలో రెండు చొప్పున వెలుగులోకి వచ్చాయి. కేరళలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది.
  • మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
  • రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉంది.
  • ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు దాటింది.
  • మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగానే ఉంది. 0.02 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా రికవరీ రేటు 98.79 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది.
  • కొవిడ్ నుంచి విజయవంతంగా కోలుకున్నవారి సంఖ్య 4,41,63,883కు చేరుకుంది.
  • కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెబ్​సైట్ ప్రకారం.. దేశవ్యాప్త కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు.

కేంద్రం అలర్ట్
కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. పలు రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదవుతుండటం ఆందోళకరమని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం లేఖలు రాసింది. కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో అధికంగా కొవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయని గుర్తు చేసింది. అయితే, ఆందోళన చెందాల్సిన పరిస్థితులేవీ కనిపించడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తన లేఖలో పేర్కొంది.

ఇన్​ఫ్లుయెంజా కేసులు సైతం పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు కేంద్రం సూచించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎదురైతే సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సిద్ధం చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపట్టాలని నిర్ణయించింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఈ డ్రిల్స్ జరుగుతాయని వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.