18+ వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోస్​- ఆదివారం నుంచే...

author img

By

Published : Apr 8, 2022, 3:10 PM IST

Updated : Apr 8, 2022, 10:51 PM IST

india booster dose

15:06 April 08

ఏప్రిల్​ 10 నుంచి అందరికీ కరోనా టీకా బూస్టర్ డోస్​

India booster dose: కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ టీకా బూస్టర్ అందించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్​ 10 నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

కరోనా టీకా రెండో డోసు తర్వాత తొమ్మిది నెలల పూరైనవారు బూస్టర్ డోసు తీసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ కరోనా మొదటి, రెండో డోసు టీకాతో పాటు ఆరోగ్య కార్యకర్తలందరికీ, 60 ఏళ్లు పైనున్నవారికి ఇస్తున్న బూస్టర్ డోసును యథావిధిగా కొనసాగిస్తారు. ఇప్పటివరకు దేశంలో 15 ఏళ్లు పైనున్న 96 శాతం జనాభాకు కనీసం ఒక డోసు పూరైంది. 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. 2.4కోట్ల ప్రికాషన్ డోసులను ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్లు పైనున్నవారికి పంపిణీ చేశారు. 12-14 ఏళ్ల పిల్లల్లో 45 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.

18ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్‌ 10 (ఆదివారం) నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రికాషన్‌ డోసు పంపిణీ చేయనుంది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారందరూ ప్రికాషన్‌ డోసు తీసుకోవచ్చు. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో.. ప్రికాషన్‌ డోసు కూడా అదే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రస్తుతమున్న తొలి, రెండు డోసుల పంపిణీ అలాగే కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ధర ఎంతంటే? : అయితే, బూస్టర్‌ డోసు వినియోగానికి అనుమతించిన తర్వాత కొవిషీల్డ్‌ డోసు ధర రూ.600 (పన్నులు అదనం)కే అందుబాటులోకి తెస్తామన్నారు. దీనితోపాటు కొవావాక్స్‌ బూస్టర్‌ డోసు ధర రూ.900 (పన్నులు అదనం)గా ఉంటుందని ఓ జాతీయ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదర్‌ పూనావాలా వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రం టీకా ధరలో డిస్కౌంట్ ఇస్తామన్నారు.

పొరుగు దేశంలో కరోనా ఉద్ధృతి: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో చైనా అల్లాడిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే కోట్ల మందిపై లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నా వేల సంఖ్యలో కేసులు బయటపడడం చైనా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే సమయంలో కొత్తగా కరోనా ఉపరకం వెలుగు చూడడం చైనా అధికారులను కలవరపెడుతోంది. భారత్​కు కూడా ఈ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం ప్రికాషన్ డోసులపై దృష్టి పెట్టింది.

Corona Booster Dose: కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోసు వల్ల ఒమిక్రాన్‌ నుంచి సమర్థమైన యాంటీబాడీ రక్షణ లభిస్తోందని పలు పరిశోధనల్లో ఇప్పటికే తేలింది. టీకా రెండు డోసులు వేసుకున్న వారితో పోలిస్తే మూడు డోసులు వేసుకున్న వారిలో 2.5 రెట్లు యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని బ్రిటన్​ పరిశోధకులు వెల్లడించారు.

Last Updated :Apr 8, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.