'బొగ్గు సరఫరా పెంచుతున్నాం.. కరెంటు సంక్షోభాన్ని తప్పిస్తాం'

author img

By

Published : Oct 10, 2021, 7:16 AM IST

Updated : Oct 10, 2021, 7:44 AM IST

coal shortage

దేశంలో థర్మల్​ కేంద్రాలకు బొగ్గు సరఫరా(coal shortage in india) పెంచుతామని తద్వారా విద్యుత్తు సంక్షోభాన్ని తప్పిస్తామని స్పష్టం చేసింది కేంద్రం. దిల్లీ, పంజాబ్​ సహా వివిధ రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయి. మొత్తంగా దేశంలోని 135 థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో సగానికిపైగా బొగ్గు నిల్వలు మూడు రోజుల అవసరాల కంటే తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బొగ్గు సరఫరా చేయనున్నట్లు హామీ ఇచ్చింది.

దేశంలోని వివిధ రాష్ట్రాలు తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటనతో ముందుకు వచ్చింది. దేశంలోని థర్మల్‌(electricity shortage in india)కేంద్రాలకు బొగ్గు సరఫరా(coal shortage in india )పెంచుతామని, సంక్షోభాన్ని తప్పిస్తామని అందులో స్పష్టంచేసింది. ప్రస్తుత కొరతకు కారణాలను సైతం వివరించింది. ఈ నెల 7వ తేదీన కోల్‌ ఇండియా 1.501 మిలియన్‌ టన్నులు సరఫరా చేసిందని, దానివల్ల వినియోగం, సరఫరా మధ్య అగాధం తగ్గిందని కేంద్ర విద్యుత్తుశాఖ శనివారం రాత్రి విడుదలచేసిన ప్రకటనలో తెలిపింది. రానున్న మూడు రోజులపాటు రోజుకు 1.6 మిలియన్‌ టన్నులు, ఆ తర్వాత రోజుకు 1.7 మిలియన్‌ టన్నులు సరఫరా చేసేందుకు కోల్‌ ఇండియా, కేంద్ర బొగ్గు శాఖ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది.

కొరతకు ఇవీ కారణాలు..

విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గడానికి నాలుగు కారణాలు ఉన్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ తెలిపింది. 1. ఆర్థిక వ్యవస్థ కోలుకున్న తర్వాత విద్యుత్తుకు ఇదివరకు ఎన్నడూలేనంతగా డిమాండ్‌ పెరగడం, 2.సెప్టెంబరు నెలలో బొగ్గుగనుల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం చూపడం, 3. దిగుమతి చేసుకొనే బొగ్గు ధరలు ఇదివరకు ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడం, 4. తద్వారా దిగుమతి బొగ్గుతో చేసే విద్యుత్తు ఉత్పత్తి భారీగా పడిపోవడాన్ని ప్రధాన కారణాలుగా పేర్కొంది. 2019లో నెలకు 106.6 బిలియన్‌ యూనిట్ల మేర ఉన్న విద్యుత్తు వినియోగం, 2021లో 124.2 బిలియన్‌ యూనిట్లకు చేరినట్లు తెలిపింది. అదే సమయంలో బొగ్గు ఆధారిత ఉత్పత్తి 61.91% నుంచి 66.35%కి చేరినట్లు పేర్కొంది. దానివల్ల ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో బొగ్గు వినియోగం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 18% పెరిగిందని వివరించింది. గ్రిడ్‌ అవసరాలకు తగ్గట్టు విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు గరిష్ఠస్థాయిలో ఉత్పత్తి చేయడానికి అక్టోబర్‌ 8న మార్గదర్శకాలు జారీచేశామని ఈ సందర్భంగా స్పష్టంచేసింది.

పెరిగిన ధరలు..

ఇండొనేసియా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు ధర 2021 మార్చిలో టన్నుకు 60 డాలర్ల మేర ఉండగా, సెప్టెంబర్‌ నాటికి 160 డాలర్లకు చేరినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ వెల్లడించింది. దీనివల్ల 2019-20తో పోలిస్తే ఇప్పుడు బొగ్గు దిగుమతి తగ్గినట్లు పేర్కొంది. ఫలితంగా దిగుమతి చేసుకున్న బొగ్గును ఉపయోగించే కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి 43.6%మేర తగ్గినట్లు వివరించింది. దానివల్ల దేశీయ బొగ్గు డిమాండ్‌ 17%మేర పెరిగినట్లు వెల్లడించింది.

దిల్లీలో ఆందోళనకర పరిస్థితి!.. పంజాబ్‌లో విద్యుత్తు కోతలు

దేశ రాజధాని దిల్లీ, పంజాబ్‌లలోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు(coal shortage news) దాదాపుగా ఆడుగంటిన స్థాయికి చేరాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం విద్యుత్తు ఉత్పత్తి ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా దేశంలోని 135 థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో సగానికిపైగా కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు మూడు రోజుల అవసరాల కంటే తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో దేశ విద్యుత్తు సరఫరాలో వీటి వాటా సుమారుగా 70 శాతం వరకు ఉంది. పంజాబ్‌లో ఇప్పటికే విడతల వారీగా విద్యుత్తు కోతలు మొదలైపోయాయి. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తుండడమే ఇందుకు కారణం. బొగ్గు కొరత నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్ర విద్యుత్తు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీఎస్‌పీసీఎల్‌) విద్యుత్తు ఉత్పత్తిని తగ్గించింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విడతల వారీగా విద్యుత్తు కోతలు అమలు చేస్తోంది. కేంద్రం చాలినంతగా బొగ్గు సరఫరా చేయట్లేదంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కొద్దిపాటి బొగ్గు నిల్వలూ వేగంగా అడుగంటుతున్నాయని, రానున్న రోజుల్లో థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు మూతపడడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, దిల్లీలో బొగ్గు నిల్వలపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిలో విద్యుత్తు సంక్షోభం తలెత్తకుండా వెంటనే బొగ్గు, గ్యాస్‌ సరఫరా చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. మూడు నాలుగు రోజుల్లో పరిస్థితులు అదుపులోకి వస్తాయని చెప్పారు.

ఇదీ చూడండి: Isro News: రోదసిలో రాకెట్‌ వేగం-అంతరిక్ష విజయాల పరంపర

Last Updated :Oct 10, 2021, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.