ETV Bharat / bharat

టీకా తీసుకుంటే బైక్, బిర్యానీ, బంగారం!

author img

By

Published : Jun 4, 2021, 8:57 AM IST

టీకా వేయించుకున్నవారికి లక్కీడ్రా రూపంలో బంగారం, ద్విచక్ర వాహనం, బిర్యానీ అందిస్తోంది ఓ స్వచ్ఛంద సంస్థ. వ్యాక్సిన్​పై ప్రజల్లో అపోహలు తొలగించి, టీకా ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషిచేస్తోంది. ఇంతకీ ఎక్కడంటే..

టీకాతో బహుమతులు
freebies for getting covid 19 vaccines

ప్రజలకు టీకాపై ఉన్న అపోహలను తొలగించి, టీకా తీసుకునేలా చేయడానికి తమిళనాడులోని ఓ గ్రామంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా బిర్యానీ, మిక్సీ, గ్రైండర్‌, 2 గ్రాముల బంగారం, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, స్కూటర్‌ తదితరాలను బహుమతులుగా ఇస్తామని చెప్పడం వల్ల ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకొచ్చారు.

చెన్నై శివారులో ఉండే మత్య్సకారుల గ్రామమైన కోవలం జనాభా 14,300. వీరిలో 18 సంవత్సరాలు పైబడిన వారు 6,400 మంది. టీకా వేసుకుంటే ఏమవుతుందోనన్న భయంతో గత రెండు నెలల్లో ఇక్కడ 58 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. దాంతో ఆ ప్రాంతానికి చెందిన ఎస్ఎస్‌ రామ్‌దాస్‌ ఫౌండేషన్‌, ఎస్‌టిఎస్‌ ఫౌండేషన్‌, చిరాజ్‌ ట్రస్టుకు చెందిన కొందరు.. ప్రజల్లో టీకాపై అవగాహన కల్పించడానికి ఈ లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఇందులో గెలుపొందినవారికి విలువైన బహుమతులు అందిస్తామని ప్రకటించారు.

ముందుగా బిర్యానీతో ప్రారంభించారు. తర్వాత మరింత ఎక్కువ మందిని ఆకర్షించాలని వారానికి మూడు బహుమతుల చొప్పున మిక్సీ, గ్రైండర్‌, రెండు గ్రాముల బంగారం ఇవ్వసాగారు. అంతేగాక చివర్లో వ్యాక్సిన్‌ పొందినవారికి లక్కీ డ్రా తీసి, అందులో విజేతలైనవారికి రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, స్కూటర్‌లను బంపర్‌ ప్రైజ్‌గా అందిస్తామని ప్రకటించారు. దాంతో మూడురోజుల్లోనే 345 మంది టీకా తీసుకున్నారని, మిగతావాళ్లకు కూడా వ్యాక్సిన్‌ వేయించి, కోవలంను కరోనా రహితం చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: టీకా వేసుకుంటే బీరు ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.