ETV Bharat / bharat

'ఉక్రెయిన్​ నుంచి ఆదివారమే రావాల్సింది.. అలా చెప్పి అంతలోనే..!'

author img

By

Published : Mar 2, 2022, 5:27 AM IST

Updated : Mar 2, 2022, 7:24 AM IST

naveen shekarappa: ఉక్రెయిన్​పై రష్యా చేస్తున్న దాడుల్లో చనిపోయిన నవీన్‌ చివరిసారిగా కుటుంబసభ్యులతో మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తమతో మాట్లాడినట్లు తండ్రి, తాతయ్యతో నవీన్‌ వీడియో కాల్‌లో తెలిపాడు. భారతీయులు క్షేమంగా ఉండేలా.. ఇరు దేశాల అధికారులతో కేంద్రం మాట్లాడిందని మంత్రి చెప్పినట్లు పేర్కొన్నాడు.

naveeen
నవీన్

naveen shekarappa: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారత విద్యార్థి మృతిచెందడం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన నవీన్‌ శేఖరగౌడ (21) మరణంపై దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే కుటుంబసభ్యులతో నవీన్‌ చివరిసారిగా (ఈరోజు ఉదయం) మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తమతో మాట్లాడినట్లు తండ్రి, తాతయ్యతో నవీన్‌ వీడియో కాల్‌లో తెలిపాడు. భారతీయులు క్షేమంగా ఉండేలా.. ఇరు దేశాల అధికారులతో కేంద్రం మాట్లాడిందని మంత్రి చెప్పినట్లు పేర్కొన్నాడు.

'కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడాము. మమ్మల్ని తరలించడంలో కాస్త సమస్యలు ఏర్పడుతున్నట్లు చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌ దేశాలతో భారత ప్రభుత్వం మాట్లాడిందని.. భారతీయులకు ఎలాంటి హాని జరగకుండా చూస్తామని ఇరు దేశాలు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు' అని నవీన్‌ అన్నాడు. ఈ నేపథ్యంలోనే నవీన్‌కు తండ్రి పలు సూచనలు చేశారు. 'మీ వద్ద పెద్ద సైజు త్రివర్ణ పతాకం ఉంటే దాన్ని మీరుంటున్న బిల్డింగ్‌ బయట ఉంచండి. మంత్రి మాకు ఇదే విషయాన్ని వెల్లడించారు' అని కుమారుడితో తండ్రి చెప్పారు.

ఖార్కివ్‌లోని గవర్నర్‌ కార్యాలయం పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో నవీన్‌ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఖార్కివ్‌లో భయానక పరిస్థితులు నెలకొనడంతో వీరంతా సమీపంలోని బంకర్‌లోకి వెళ్లారు. అయితే బంకర్‌లోనుంచి ఎందుకు రాలేకపోయావు? అనే తండ్రి ప్రశ్నకు.. 2శాతం మంది మాత్రమే బంకర్‌ను వదిలి వెళ్లే అవకాశం ఉందని, రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపాడు. 'రైళ్ల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఉదయం 6, 10గంటలతోపాటు మధ్యాహ్నం ఒంటిగంటకు రైళ్లు ఉన్నాయి' అని నవీన్‌ తండ్రితో అన్నాడు. 'అయితే పరిస్థితులను గమనించాకే ఎలాంటి నిర్ణయమైనా తీసుకో. అక్కడి నుంచి 40-50కి.మీ. ముందుకుసాగితే అక్కడి నుంచి వచ్చేందుకు మరిన్ని మార్గాలు ఉంటాయి' అని తండ్రి సూచించారు.

కుటుంబసభ్యులతో మాట్లాడిన కొన్ని గంటలకే షెల్‌ దాడిలో నవీన్‌ మృతిచెందాడు. బంకర్‌లో భోజనం, నీళ్లు లేకపోవడంతో కరెన్సీ మార్చుకుని ఆహారం తెచ్చుకునేందుకు నవీన్‌ బంకర్‌ నుంచి బయటకు వచ్చాడు. గవర్నర్‌ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఓ గ్రాసరీ స్టోర్‌కు వెళ్లి అక్కడ క్యూలైన్‌లో నిల్చున్నాడు. అదే సమయంలో రష్యా బలగాలు.. గవర్నర్‌ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని షెల్‌ ప్రయోగించింది. అయితే అది కాస్తా గురితప్పి గ్రాసరీ స్టోర్‌ సమీపంలో పడింది. దీంతో నవీన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఆహార పదార్థాల కోసం వెళ్లి..

''నవీన్‌ ఆరు రోజులుగా మాతో పాటే ఖర్కివ్‌లోని ఓ బంకర్‌లో ఉంటున్నాడు. మేం మొత్తం 30 మంది కన్నడ విద్యార్థులం. వీరిలో 10 మంది జూనియర్లు. మిగిలిన వారు నవీన్‌తోటి వారు, పలువురు సీనియర్లు. మేం తెచ్చుకున్న ఆహార పదార్ధాలు మూడు రోజుల వరకు వచ్చాయి. గత మూడు రోజులుగా స్నిక్కర్లు, బిస్కెట్లు తింటూ గడుపుతున్నాం. సోమవారం సాయంత్రం కూడా ఒకరిద్దరు దగ్గరిలోని స్టోర్‌కు వెళ్లి కావాల్సిన ఆహార పదార్ధాలు తెచ్చుకున్నారు. ఇక్కడ చలి తట్టుకోలేనంతగా ఉంటోంది. తిండి, నీరు లేకుంటే ఉండటం కష్టం. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మేలుకొనే ఉన్నాం. ఉదయం మేము ఆరు గంటలకు నిద్రలేచే సరికి నవీన్‌ బయటకు వెళ్లాడు. మా బంకర్‌కు 50 మీటర్ల దూరంలో ఓ స్టోర్‌ ఉంది. గంటన్నర తర్వాత నవీన్‌ ఫోను చేసి తగినంత డబ్బులేదు ట్రాన్స్‌ఫర్‌ చేయమని కోరగా మేము పంపించాం. ఎనిమిది గంటలకు నవీన్‌ ఫోన్‌కు కాల్‌ చేయగా ఉక్రెయిన్‌కు చెందిన వ్యక్తి మాట్లాడుతూ ‘హి ఈజ్‌ నో మోర్‌’ అన్నారు. ఫోను ఎక్కడో పడేసి నవీన్‌ వెళ్లాడనే అనుకున్నాం.. ఇలా చనిపోతాడని ఊహించలేదు.''

- అమిత్‌, నవీన్‌ స్నేహితుడు

అందరం వెళ్దామని..

'ఆపరేషన్‌ గంగ'లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కర్ణాటకకు చేరుకున్న బృందంలో నవీన్‌ రావాల్సి ఉంది. మనతో పాటు జూనియర్లు ఎందరో ఉన్నారు. వారితో కలిసి అందరం ఒకేసారి వెళ్దామని చెప్పిన నవీన్‌.. ఇలా ఒంటరిగా వెళ్లిపోయాడని శ్రీధర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో భారతీయ విద్యార్థి మృతి

Last Updated : Mar 2, 2022, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.