ETV Bharat / bharat

బాలుడు నరబలి!.. చెట్టుకు ఉరివేసి, కళ్లు పీకి, కాళ్లూచేతులు నరికి హత్య

author img

By

Published : Jul 31, 2023, 4:32 PM IST

Minor Boy Human Sacrifice In Odisha : 14 ఏళ్ల బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. బాధితుడ్ని నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు మైనర్​ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశారు ఇద్దరు వ్యక్తులు. రాజస్థాన్​లో ఈ ఘటన జరిగింది.

human-sacrifice-in-odisha-human-sacrifice-in-odisha-by-woman-priest-and-minor-sisters-raped-in-rajasthan
ఒడిశాలో 14 ఏళ్ల బాలుడి నరబలి

Human Sacrifice In Odisha : ఒడిశాలో 14 ఏళ్ల బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. బాధితుడ్ని చెట్టుకు ఉరివేసి.. కాళ్లు, చేతులు నరికేశారు నిందితులు. కళ్లు సైతం తొలగించారు. అంగుల్‌ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యను నరబలిగా అనుమానిస్తున్నారు పోలీసులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కియాకటా పోలీసు స్టేషన్​ పరిధిలోని సుబర్ణాపుర్ గ్రామానికి చెందిన.. సంచిత్​ అనే బాలుడు ఇలా హత్యకు గురయ్యాడు. అతడి శరీర భాగాలు వివిధ చోట్ల పడేసి ఉన్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. బాలుడి హత్యకు ముందు.. అతడి ఆరోగ్యం అంతగా బాగుండలేదని తల్లి బసంతి తెలిపింది. దీంతో పూజలు నిర్వహించేందుకు మంగళ కోఠి అనే ఆలయానికి జులై 22న కొడుకును తీసుకెళ్లినట్లు వెల్లడించింది. రీతాంజలి అనే మహిళ అధ్వర్యంలో ఈ ఆలయం నడుస్తోందని.. ఆ రోజు రాత్రి తామిద్దరం వేరే వేరే గదిలో బస చేసినట్లు పేర్కొంది. మరుసటి తెల్లారి సంచిత్​ కనిపించకుండా పోయాడని వాపోయింది.

అనంతరం దీంతో కంగారు పడ్డ తల్లి బసంతి.. కొడుకు కోసం పలు చోట్ల గాలించింది. ఎంతకీ కుమారుడి ఆచూకీ లభించని కారణంగా జులై 24న పోలీసులను ఆశ్రయించింది. జూలై 28న స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసి ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడ్ని చంపిన తీరును చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. సంచిత్​ను నరబలి ఇచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు. మంగళ కోఠి ఆలయ పూజారి రీతాంజలే ఈ ఘటన పాల్పడి ఉంటుందని భావించారు. అనంతరం రీతాంజలిని.. ఆమె ముగ్గురు కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్రాథమికంగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ తరువాతే హత్యకు గల కారణాలు తెలుస్తాయని వారు వెల్లడించారు.

ఇద్దరు మైనర్​ అక్కాచెల్లెళ్లపై అత్యాాచారం.. గర్భం..
Minor Sisters Raped In Rajasthan : మైనర్లైన అక్కాచెల్లెళ్ల పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి.. వారి గర్భానికి కారణమైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న పెద్ద బాలికను హాస్పిటల్​కు తీసుకెళ్లగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అల్వార్‌ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఇటుకల క్వారీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇతనితో పాటే పనిచేస్తున్న సప్పి, సుభాన్‌ అనే ఇద్దరు వ్యక్తులు.. ఈ బాలికలను పలుమార్లు అత్యాచారం చేశారు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. కడుపు నొప్పితో బాధ పడుతున్న పెద్ద బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఏడున్నర నెలల గర్భవతి అని వైద్యులు తేల్చారు.

అనంతరం బాలికను తండ్రి నిలదీయగా.. అసలు విషయం బయటపడింది. తనతో పాటు చెల్లిపై కూడా అత్యాచారం జరుగుతున్నట్లు తెలిపింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుల తండ్రి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో బాలికకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమె కూడా రెండు నెలల గర్భిణి అని తేలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.