ETV Bharat / bharat

'సీసీ కెమెరాలు అమర్చాలని ఆస్పత్రులను ఆదేశించలేం'

author img

By

Published : Oct 9, 2021, 1:32 PM IST

దేశంలోని ఆసుపత్రులన్నింటిలో సీసీటీవీ కెమెరాలు(cctv cameras in hospitals) అమర్చాలంటూ ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను సుప్రీం కోర్టు(Supreme court) కొట్టివేసింది. ఆసుపత్రులేమీ పోలీసు స్టేషన్లు కాదని.. ప్రతి వార్డులోనూ కెమెరాలు అమర్చాలని(security cameras in hospitals ) ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. ప్రీ స్కూళ్ల రుణాలపై మారటోరియం తమ పరిధి కాదని విచారణకు నిరాకరించింది.

Supreme Court
సుప్రీం కోర్టు

ఆసుపత్రులేమీ పోలీసు స్టేషన్లు కాదని.. ప్రతి వార్డులోనూ సీసీ టీవీ కెమెరాలు(cctv cameras in hospitals) అమర్చాలని ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈమేరకు 'ఆల్‌ ఇండియా కన్సూమర్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ యాక్షన్‌ కమిటీ' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం(Supreme court) కొట్టివేసింది. విస్పష్టమైన వినతులతో మరోసారి రావాలని ఆదేశించింది. దేశంలోని అన్ని ఆసుపత్రుల్లోనూ సీసీ టీవీ కెమెరాలు(security cameras in hospitals ) అమర్చాలంటూ ఆదేశాలివ్వలేమని.. అక్కడ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలు కూడా ముడిపడి ఉండొచ్చని ధర్మాసనం పేర్కొంది. అలాగే వైద్యులు మందుల చీటీలను ప్రాంతీయ భాషల్లో రాయాలంటూ స్వచ్ఛంద సంస్థ చేసిన విజ్ఞాపనను కూడా తోసిపుచ్చింది. ఇదెలా సాధ్యమని ప్రశ్నించింది. కాగా పిటిషనర్‌ చేసిన ఒక విజ్ఞాపనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు ఉన్నవారికి ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతించాలన్న ఈ విజ్ఞాపనతో వస్తే పరిశీలిస్తామని తెలిపింది.

కొవిడ్‌-19 రోగుల నుంచి ఆసుపత్రులు, వైద్యులు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి గాను ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు(Supreme court) శుక్రవారం తెలిపింది. ఈ అంశంపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసు ఇచ్చింది.

మారటోరియం విధింపు మా పరిధిలో లేదు

బ్యాంకుల నుంచి ప్రీ స్కూళ్ల నిర్వాహకులు తీసుకున్న రుణాల చెల్లింపుపై వడ్డీరహిత మారటోరియం విధించేలా కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. అది తమ పరిధిలో లేని విషయమని స్పష్టం చేసింది. ప్లే (ప్రీ) స్కూళ్ల సంఘం- 'ది ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేటర్స్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఐసీఈసీఈఐ)' తాజా పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

'వివాద పరిష్కార వ్యవస్థ'పై స్పందన తెలపండి

కొవిడ్‌ నేపథ్యంలో రద్దయిన 12వ తరగతి పరీక్షల ఫలితాలకు(cbse 12th results) సంబంధించి వివాద పరిష్కార వ్యవస్థను సరిగా అమలు చేయడంలో సీబీఎస్‌ఈ విఫలమైందంటూ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈ నెల 18 లోపు స్పందన తెలియజేయాల్సిందిగా జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవిలతో కూడిన ధర్మాసనం సీబీఎస్‌ఈని ఆదేశించింది.

  • కరోనా సంక్షోభం వేళ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర అణగారిన వర్గాల పిల్లలు ఆన్‌లైన్‌ విద్యకు దూరమవుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా హక్కు చట్టం వాస్తవరూపం దాల్చేలా సమర్థ ప్రణాళికను రూపొందించి తమకు నివేదించాలని కేంద్రం, దిల్లీ సర్కారును ఆదేశించింది.
  • చెల్లని చెక్కు కేసుల్లో చర్యలు తీసుకోవడం ఆలస్యమవుతుండటం.. మన దేశంలో సులభతర వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్‌ఐ చట్టంలోని నిబంధనలకు సంబంధించి దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

చివరి అవకాశమిస్తున్నాం..

సైన్యంలో 72మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ (పీసీ) మంజూరు చేయడంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రానికి మరొక్క అవకాశమిస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. పీసీ హోదా కల్పనకు సంబంధించి ఈ ఏడాది మార్చి 25న తాము జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఆ సమస్యను పరిష్కరించాలని సూచించింది. దీనిపై దృష్టిసారించాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్, సీనియర్‌ న్యాయవాది ఆర్‌.బాలసుబ్రమణియన్‌లను జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం కోరింది.

ఇదీ చూడండి: Lakhimpur Kheri: 'మిగతా కేసుల్లోనూ నిందితులతో ఇలాగే వ్యవహరిస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.