ETV Bharat / bharat

హిమాచల్​ప్రదేశ్​ మాజీ సీఎం వీరభద్ర సింగ్​ కన్నుమూత

author img

By

Published : Jul 8, 2021, 5:31 AM IST

Updated : Jul 8, 2021, 11:38 AM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత, హిమాచల్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మరణించారు.

himachal former cm, virabhadra singh
వీరభద్ర సింగ్, హిమాచల్ ప్రదేశ్​ మాజీ సీఎం

హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరభద్ర సింగ్‌(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఆయనకు గుండెపోటు రావడంతో పరిస్థితి మరింత క్షీణించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి సూపరిండెంట్‌ వెల్లడించారు.

2 నెలల్లో రెండుసార్లు కరోనా..

వీరభద్ర సింగ్‌ రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు కరోనా బారినపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 12న ఆయనకు తొలిసారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఛండీగఢ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత కోలుకుని ఏప్రిల్‌ 30న ఇంటికి చేరుకున్నారు. అయితే, ఇంటికి వచ్చిన కొద్ది గంటల తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో ఉన్న ఆయనకు జూన్‌ 11న మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

6 సార్లు ముఖ్యమంత్రిగా..

1934 జూన్‌ 23న హిమాచల్‌లోని సరహాన్‌ ప్రాంతంలో జన్మించిన వీరభద్ర సింగ్‌.. 1960ల్లో రాజకీయాల్లోకి వచ్చారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తొలుత జాతీయ రాజకీయాల్లో ముద్ర వేసి, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహసు స్థానం నుంచి గెలిచి తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1967, 1971, 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు.

1983 అక్టోబరులో రాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు. జుబ్బల్‌-కొట్కాయ్‌ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో గెలిచారు. అదే ఏడాది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. హిమచాల్‌ ప్రదేశ్‌కు నాలుగో ముఖ్యమంత్రి ఆయనే. అంతేగాక, ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి కూడా వీరభద్రనే. ఆ తర్వాత వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో ఆరు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన అర్కీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు 1977, 1979, 1980, 2012లో హిమచాల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.

వీరభద్రసింగ్‌ సతీమణి ప్రతిభా సింగ్‌, కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ కూడా రాజకీయనాయకులే. ప్రతిభ గతంలో ఎంపీగా పనిచేశారు. విక్రమాదిత్య.. సిమ్లా రూరల్‌ నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..

వీరభద్ర సింగ్ మృతిపట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

వీరభద్ర సింగ్‌ మరణం బాధాకరం. ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 6 దశాబ్దాల పాటు హిమాచల్‌ ప్రజలకు నిబద్ధతతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా

-రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పాలనపరంగా, చట్టపరంగా అపార అనుభవం ఉన్న వ్యక్తి వీరభద్రసింగ్‌. హిమచల్‌ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ప్రజలకు సేవలందించారు. ఆయన మృతి విచారకరం

-ప్రధానమంత్రి నరేంద్రమోదీ

వీరభద్రసింగ్‌.. బలమైన నేత, ప్రజలు, పార్టీ పట్ల ఆయన నిబద్ధత ఎప్పటికీ ఓ ఉదాహరణగా నిలిచిపోతుంది. ఆయన మృతి బాధాకరం. మేం ఆయన్ని మిస్‌ అవుతూనే ఉంటాం

-కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

ఇదీ చదవండి:హిమాచల్​ప్రదేశ్​ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జాం!

Last Updated :Jul 8, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.