ETV Bharat / bharat

'వ్యాక్సినేషన్​తోనే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ'

author img

By

Published : Mar 27, 2021, 10:54 AM IST

వ్యాక్సినేషన్ ద్వారానే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందని ఐసీఎంఆర్​ సీనియర్ శాస్త్రవేత్త డా. సమీరన్ పాండా తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా భారీగా జనం గుమిగూడటం వంటి అంశాల కారణంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ప్రస్తుతం ఉన్న టీకాలకు వేరియంట్లపై పోరాడే సత్తా ఉందని స్పష్టం చేశారు.

Herd immunity through vaccination crucial to fight Covid19: ICMR scientist
'వ్యాక్సినేషన్​తోనే దేశంలో హెర్డ్ ఇమ్యునిటీ సాధ్యం'

దేశంలో ఇటీవల పెరుగుతున్న కరోనా కేసులు కొత్త మ్యూటెంట్ల వల్ల కాదని ఐసీఎంఆర్​లోని ఎపిడెమాలజీ-కమ్యునికేబుల్ డిసీజ్ విభాగాధిపతి, సీనియర్ సైంటిస్ట్ డా. సమీరన్ పాండా తెలిపారు. కరోనా వేరియంట్లపై పోరాడే సామర్థ్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన డా. పాండా... వ్యాక్సినేషన్ ద్వారానే భారత్​లోని ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీని సాధించాలని అన్నారు.

డా. సమీరన్ పాండా ఇంటర్వ్యూ

"ఈ టీకాలు సమర్థంగా పనిచేస్తాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్త మ్యుటెంట్ల నుంచి మన వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయి. వ్యాక్సిన్లు వైరస్ సంక్రమణను నివారించవు. అయితే.. టీకా తీసుకున్న ఓ వ్యక్తి కరోనా బారిన పడితే వారిలో వైరస్ తీవ్రత తగ్గుతుంది. వారు ఆస్పత్రిలో చేరే అవకాశం తక్కువగా ఉంటుంది."

-డా. సమీరన్ పాండా, ఐసీఎంఆర్

దేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలంతా కరోనా జాగ్రత్తలను తప్పక పాటించాలని పాండా సూచించారు. ఎన్నికల ప్రచారాలు, సామాజిక కార్యక్రమాల్లో భారీ సమూహాలుగా ఏర్పడటం వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని అన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో భారీ ర్యాలీలు, పండగల నేపథ్యంలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

మ్యుటెంట్లు అంటే?

మహమ్మారి విస్తరించినప్పుడు.. వైరస్​లోని అమైనో ఆమ్లాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయని, వాటినే మ్యుటెంట్లు అంటారని వివరించారు పాండా. మ్యుటేషన్ భారీ స్థాయిలో ఉంటే దాన్ని 'షిఫ్ట్' అని, స్వల్ప స్థాయిలో ఉంటే దాన్ని 'డ్రిఫ్ట్' అని పరిగణిస్తారని చెప్పారు. కొన్ని మ్యుటెంట్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని తెలిపారు. అయితే ఇదంతా సాధారణంగా జరిగేదే అని స్పష్టం చేశారు. అన్ని మ్యుటేషన్లు హానికరం అయ్యే అవకాశం లేదని అన్నారు.

"దేశంలో రెండో దశ వ్యాప్తికి డబుల్ మ్యుటెంట్ కారణమని చెప్పలేం. పంజాబ్​లో భారీ స్థాయిలో యూకే వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దానర్థం అన్నిచోట్ల యూకే వేరియంట్ ఉన్నట్లు కాదు. ఇన్ఫెక్షన్ ద్వారా హెర్డ్ ఇమ్యునిటీ సాధించడం కంటే.. వ్యాక్సినేషన్ ద్వారా సాధించడమే ఉత్తమం. భారత్ లాంటి దేశాల్లో ఇన్ఫెక్షన్ ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు. కానీ, వ్యాక్సినేషన్ ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం సులభం."

-డా. సమీరన్ పాండా, ఐసీఎంఆర్

వైరస్ కేసులు పెరుగుతున్నందున ఆందోళన చెందకూడదని పాండా పేర్కొన్నారు. కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాక్సినేషన్ అంశంలో ఆయా జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 62వేల మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.