ETV Bharat / bharat

ఆ కుటుంబానికి అండగా బంకర్‌లో.. భారతీయ విద్యార్థిని సాహసం

author img

By

Published : Feb 28, 2022, 5:40 AM IST

Ukraine Russia crisis : ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతున్నప్పటికీ.. నేహా అనే వైద్య విద్యార్థిని అక్కడే ఉండేందుకు సాహసించింది. యుద్ధంలో పాల్గొనేందుకు ఇంటి యజమాని కదనరంగంలోకి దిగగా.. ఆయన భార్య, ముగ్గురు పిల్లలకు అండగా నిలిచేందుకు అక్కడే ఉండేందుకు నిర్ణయించుకుంది.

Haryana girl
భారతీయ విద్యార్థిని సాహసం

Ukraine Russia crisis : ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. దీంతో అక్కడి భారత విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిని తీసుకొచ్చేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే పలు విమానాల్లో కొందరు ఇక్కడకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఓ విద్యార్థిని మాత్రం ఈ పరిస్థితుల్లో స్వదేశానికి రాలేనని తేల్చి చెప్పింది. మానవత్వాన్ని చాటుకుంటూ.. ఓ కుటుంబానికి అండగా నిలిచేందుకు సిద్ధపడింది.

ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతున్నప్పటికీ.. నేహా అనే వైద్య విద్యార్థిని అక్కడే ఉండేందుకు సాహసించింది. యుద్ధంలో పాల్గొనేందుకు ఇంటి యజమాని కదనరంగంలోకి దిగగా.. ఆయన భార్య, ముగ్గురు పిల్లలకు అండగా నిలిచేందుకు అక్కడే ఉండేందుకు నిర్ణయించుకుంది. సంరక్షకులను కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని పేర్కొన్న నేహా.. ప్రస్తుతం ఓ బంకర్‌లో ఆ పిల్లలు, వారి తల్లికి రక్షణగా నిలిచింది. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

హరియాణాకు చెందిన నేహా (17) ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో మెడిసిన్‌ చదివేందుకు గతేడాది అక్కడకు వెళ్లింది. హాస్టల్‌లో వసతి లభించకపోవడంతో ఓ కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌ ఇంట్లో అద్దెకు ఉంటూ కాలేజీకి వెళుతోంది. భారత సైన్యంలో విధులు నిర్వహించిన నేహా తండ్రి కొన్నేళ్ల క్రితమే ఓ దాడిలో మృతిచెందారు. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తడంతో.. సాయం కోసం ఉక్రెయిన్‌ అర్థిస్తోంది. దేశ పౌరులు స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొనాలని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే నేహా ఉంటున్న ఇంటి యజమాని యుద్ధం చేసేందుకు వెళ్లారు. దీంతో ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో నేహా ఓ బంకర్‌లోకి వెళ్లిపోయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో వారిని అలా వదిలేసి రాలేనని పేర్కొంది.

'బతికుంటానో లేదో తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు పిల్లలు, వారి తల్లిని వదిలేసి రాలేను' అని హరియాణాలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన తల్లికి ఫోన్‌ ద్వారా నేహా స్పష్టం చేసింది. సమీపంలో బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయని.. అయితే ప్రస్తుతం తాము క్షేమంగానే ఉన్నట్లు తెలిపింది.

నేహా గురించి ఆమె స్నేహితురాలు సవితా జఖార్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించింది. 'ఇంటి ఓనర్‌ కుటుంబంతో నేహా మంచి సంబంధాలను ఏర్పరచుకుంది. యుద్ధం ముంచుకొస్తుండటంతో దేశాన్ని విడిచి వెళ్లాలని ఆమెకు సూచనలు వెళ్లాయి. అక్కడి నుంచి రప్పించేందుకు ఆమె తల్లి తీవ్రంగా కృషి చేసింది. రొమేనియా సరిహద్దుకు వెళ్లేందుకు కూడా ఆమెకు అవకాశం వచ్చింది. కానీ ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని వదిలేసి వచ్చేందుకు ఆమె అంగీకరించేదు. జీవితం ఆపదలో ఉందని ఆమెకు తెలుసు. కానీ వారిని అలా వదిలేసి రాలేకపోయింది' అని సవిత పేర్కొంది.

ఇదీ చూడండి:

ఉక్రెయిన్​ పరిణామాలపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.