ETV Bharat / bharat

Gujarat CM News: గుజరాత్​ తదుపరి సీఎంపై నేడే నిర్ణయం!

author img

By

Published : Sep 12, 2021, 6:50 AM IST

గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి విజయ్‌ రూపానీ రాజీనామాతో కొత్త సీఎం ఎంపికపై భాజపా దృష్టి సారించింది. కొత్త సీఎంను ఎన్నుకొనేందుకు (Gujarat CM News) గుజరాత్‌ భాజపా శాసనసభాపక్షం ఇవాళ భేటీ అయ్యే అవకాశం ఉంది. సీఎం పదవికి పలువురు కేంద్ర మంత్రులు సహా అనేక మంది నేతలు రేసులో నిలిచారు. అటు విజయ్‌ రూపానీ రాజీనామా (Vijay Rupani Resignation) వ్యవహారంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. భాజపా ఆయనను బలిపశువు చేసిందని ఆరోపించాయి.

gujarat cm
gujarat cm news: గుజరాత్​ తదుపరి సీఎంపై నేడే నిర్ణయం!

అనూహ్య పరిస్ధితుల మధ్య గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజీనామా (Vijay Rupani Resignation) చేసిన వేళ ఆయన వారసుడి ఎంపికపై భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. భాజపా దూతలుగా గుజరాత్‌లో మకాం వేసిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్‌ ఇప్పటికే.. ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్​ పాటిల్‌, ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ సహా పలువురు మంత్రులు, శాసనసభ్యులు, సీనియర్‌ నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. కొత్త సీఎం ఎంపికపై (Gujarat CM News) గుజరాత్‌ భాజపా శాసనసభాపక్షం నేడు సమావేశమయ్యే అవకాశం ఉంది.

సమావేశానికి అమిత్​ షా..

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (amit shah gujarat) సహా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్​ జోషి, నరేంద్ర సింగ్​ తోమర్​లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త సీఎం పదవికి రేసులో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. పటేల్‌ సామాజిక వర్గానికి సీఎం పదవి కట్టబెడతారని ఊహాగానాలు వస్తుండగా ఆ వర్గానికి చెందిన కేంద్ర మంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, పురుషోత్తం రూపాలా, ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌, వ్యవసాయ మంత్రి ఆర్​సీ ఫాల్దూ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనుండడం, పటేల్‌ సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో కొత్త సీఎం ఎంపికపై భాజపా ఆ కోణంలోనే నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సొంత రాష్ట్రం కావడం వల్ల గుజరాత్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భాజపా.. సమర్ధంగా పార్టీని నడిపించే నేతనే సీఎం పదవికి ఎంపిక చేయాలని భావిస్తోంది.

రాజీనామాపై విమర్శలు..

విజయ్‌ రూపానీ రాజీనామా వ్యవహారంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. విజయ్‌ రూపానీ వైఫల్యాలకు ప్రధాని నరేంద్ర మోదీదే బాధ్యత అని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా అన్నారు. అన్ని రాష్ట్రాల్లో భాజపా నేతల మధ్య కుమ్ములాటలు సాగుతున్నాయని విమర్శించారు. గాంధీ, సర్దార్‌ పటేల్‌ కర్మభూమి గుజరాత్‌కు భాజపా నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం వచ్చిందని ట్విట్టర్‌లో అన్నారు. విజయ్‌ రూపానీని భాజపా బలిపశువును చేసిందని తృణమూల్ కాంగ్రెస్‌ ఆరోపించింది. గుజరాత్‌లో పాలన గాడితప్పిందని, అయితే రూపానీ తొలగింపునకు అది కారణం కాదని తెలిపారు. గుజరాత్‌ భాజపాలో అంతర్గత విభేదాల కారణంగానే ఆయనను తొలగించారని తృణమూల్‌ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ అన్నారు.

ఇదీ చూడండి : Vijay Rupani: విజయ్​ రూపానీ రాజీనామాకు అదే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.