ETV Bharat / bharat

ఫాదర్స్​ డే.. డూడుల్​తో గూగుల్​ స్పెషల్​ విషెస్​

author img

By

Published : Jun 19, 2022, 10:54 AM IST

Updated : Jun 19, 2022, 11:49 AM IST

google
google

Fathers day 2022: నాన్న.. బిడ్డ ఎదుగుదల కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడే శక్తి. నాన్న ఉన్నాడంటే మరేం పర్వాలేదు అనే ధీమా పిల్లల్లో కలిగిస్తాడు. అందుకే తల్లితో సమానంగా తండ్రిని కూడా గుర్తిస్తూ అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్​ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తండ్రులకు డూడుల్​ ద్వారా స్పెషల్​ యానిమేషన్​తో విషెస్​ చెప్పింది.

Fathers day 2022: అమ్మ నవ మాసాలు మోసి జన్మనిస్తే.. బతుకంతా ధారపోసి జీవితాన్నిచ్చేది నాన్న. స్వార్థంలేని ప్రేమతో గుండెలపై ఆడించి.. బతుకు దారి చూపే మార్గదర్శి. కష్టాల్లో నిబ్బరంగా, ఆపదలో ధైర్యంగా ఉండేలా తీర్చిదిద్దేది తండ్రే. కన్నబిడ్డ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే శ్రమజీవి. అందుకే బిడ్డ ఎంత ఎత్తుకెదిగినా అంతకంటే పైమెట్టులోనే ఉంటాడు నాన్న. అతని త్యాగం, ఓర్పు వెలకట్టలేనివి. ఆయన రుణం తీర్చలేనిదని బిడ్డలు చెబుతారు. అందుకే ఆయన ప్రేమకు, సేవలను స్మరించుకునేందుకు ఓ రోజును కేటాయించారు. అదే అంతర్జాతీయ పితృదినోత్సవం(జూన్​ మూడో ఆదివారం జరుపుకుంటారు). అందుకే ఈ రోజు ప్రత్యేకతను చాటడానికి దిగ్గజ సెర్చ్​ఇంజిన్​ సంస్థ గూగుల్​.. డూడుల్​ను తయారుచేసింది. తండ్రి, బిడ్డతో గడిపే క్షణాలను ప్రతిబింబించేలా యానిమేషన్​తో ఉన్న ఈ డూడుల్​ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తొలిసారి ఫాదర్స్​డే ఎప్పుడంటే..?
ఏటా జూన్ నెల మూడో ఆదివారం నాడు అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్​ మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవంగా ప్రకటించుకుని వేడుకలు జరుపుకుంటున్నాయి. బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా 'స్మార్ట్ డాడ్' పేరిట ప్రచారం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి 'ఫాదర్స్ డే' ను గుర్తించి జరుపుకున్నారు.

తండ్రి తోడు ప్రతి బిడ్డకు ఓ రక్షణ కవచం
కాలం మారింది కాలంతో పాటు జీవనశైలి మారింది. పురుషులతోపాటు మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తూ, కుటుంబ బాధ్యతల్లోనే కాకుండా.. ఆర్థిక బాధ్యతలనూ పంచుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో పిల్లల ఆలనాపాలనా తల్లులే కాకుండా.. తండ్రులూ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండ్రి తోడు ప్రతి బిడ్డకు ఓ రక్షణ కవచం. మగ పిల్లలకంటే తండ్రితో ఆడపిల్లలకి అనుబంధం ఎక్కువ. తానే బొమ్మయి ఆడించే నాన్న ఉంటే.. ఇంకేం కావాలి ఆడపిల్లలకు. కోరినవన్నీ క్షణాల్లో తెచ్చిపెట్టే తండ్రే తమ లోకం అనే భావన ప్రతి బిడ్డకు కలగకమానదు. అంతటి అపారమైన ప్రేమను పంచడం ఒక్క తండ్రికే సొంతం.

నాన్న ఒక పెద్ద చెట్టు. తన నీడ పడితే బిడ్డ పెరగడేమోనని భయం కాబోలు.. తను ఒదిగి ఉండి, మనల్ని ఎదగనిస్తాడు. నాన్న చేసేది.. రైతు చేసేదీ ఒకే పని. కాక పోతే రైతు నారుమడిలో పెట్టుబడి.. గిట్టుబాటు పదాలుంటాయి. కానీ నాన్న పేజీలో అవేవీ ఉండవు. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. కాలం బాట మీద కనిపించని సాధకుడు నాన్న. నాన్న మనసు కనిపించదు. బాధనంతా తన గుండెల భాండాగారంలో భద్రపరిచి కుటుంబం కోసం చమట రూపంలో ఖర్చు చేస్తాడు. నాన్నను అర్థం చేసుకునే అవకాశం కూడా రాదు. ప్రతి బిడ్డ మీద తండ్రి ప్రభావం అపారం.

నాన్నంటే వాడిపడేసే వస్తువు కాదు
నాన్నంటే వాడిపడేసే వస్తువు కాదు.. అనురాగం, అర్ధ జీవితం దారపోసి పెంచిన పితృమూర్తి అని పిల్లలు గుర్తించాలి. తన రెక్కల కష్టం పిల్లలకు తెలియకుండా.. వారి ఆలనా, పాలనా చూసి పిల్లల బాగోగులే కోరుకునే వ్యక్తి నాన్న. అటువంటి నాన్నకు ఏమిచ్చినా తక్కువే. అలాంటి తండ్రికి ఏం చేసినా తక్కువే. నీ కడుపున పుట్టిన పిల్లలు నీకు ఎంత మధురమో.. నిన్ను కనిపించిన తండ్రి అంతే అపురూపం. అందుకే నాన్నను వెనకబడనీయకండి. నాన్నకు చేయూతనివ్వండి. నాన్నతో కలిసి నడవండి. మీ నాన్నకు నాన్న అవ్వండి. ఇదే ఈ పితృదినోత్సవం రోజున మీ నాన్నకు మీరిచ్చే అపూర్వ కానుక.

ఇవీ చూడండి :

అప్పుడే తెలుస్తుంది నాన్న అంటే ఏమిటో..

మీ సూపర్​ హీరో కోసం ఏం సిద్ధం చేస్తున్నారు?

నాన్న మీకు నీరాజనాలు... మీరే లేకుంటే బతుకే లేదు

Last Updated :Jun 19, 2022, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.