ETV Bharat / bharat

కాంగ్రెస్​కు గులాం నబీ ఆజాద్ గుడ్​బై, రాహుల్​పై తీవ్ర విమర్శలు

author img

By

Published : Aug 26, 2022, 11:32 AM IST

Updated : Aug 26, 2022, 12:42 PM IST

Ghulam Nabi Azad
కాంగ్రెస్​కు బిగ్​ షాక్, పార్టీకి గులాం నబీ ఆజాద్ గుడ్​బై

11:30 August 26

కాంగ్రెస్​కు బిగ్​ షాక్, పార్టీకి గులాం నబీ ఆజాద్ గుడ్​బై

Gulam Nabi Azad Resigns: సంక్షోభాల సవారీ చేస్తున్న కాంగ్రెస్​ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్​ ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీలోని అన్ని పదవులకు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అగ్రనేత రాహుల్​ గాంధీ వ్యవహార శైలి సహా పార్టీ అధినాయకత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆజాద్.

'చేయాల్సింది భారత జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్ జోడో​ యాత్ర'
"ఏఐసీసీని నడిపే కోటరీ ఆధ్వర్యంలో పోరాడాలన్న సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. భారత్​ జోడో యాత్ర కన్నా ముందు పార్టీ​ అధినాయకత్వం కాంగ్రెస్​ జోడో యాత్రను చేపట్టాల్సింది" అని గులాం నబీ ఆజాద్​ దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్‌కు కష్టాలు ఆరంభమయ్యానని ఆజాద్‌ ఆరోపించారు. రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని, అనుభవజ్ఞులైన నేతలను రాహుల్‌ పక్కకు పెడుతున్నారంటూ విమర్శించారు ఆజాద్‌. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకొని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. పార్టీలోని సంస్థాగత మార్పుల కోసం లేఖ రాసిన 23 మంది నేతలను తీవ్రంగా అవమానించారని అని ఆయన అన్నారు.

ఇప్పటికీ రిమోట్‌ కంట్రోల్‌ విధానమే..
2019 ఎన్నికల నాటి నుంచి పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోందని ఆజాద్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని దెబ్బతీసిన రిమోట్‌ కంట్రోల్‌ విధాన్నానే ఇప్పటికీ కాంగ్రెస్‌లో అమలు చేస్తున్నారని తప్పుపట్టారు. పార్టీకి సంబంధించిన చాలా విషయాల్లో సోనియాగాంధీ పాత్ర నామమాత్రమేనని.. కీలక నిర్ణయాలు రాహుల్‌ గాంధీ లేదా ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలు తీసుకొంటున్నారని తప్పుపట్టారు.

అధినాయకత్వం అంతరాత్మను ప్రశ్నించుకోవాలి..
తాజాగా నిర్వహిస్తోన్న పార్టీ ఎన్నికలు కూడా ఓ బూటకమని ఆజాద్‌ ఆరోపించారు. ఏఐసీసీ కోటరీ ముందుగానే సిద్ధం చేసిన జాబితాపై సంతకాలు చేయిస్తారని పేర్కొన్నారు. అసలు ఇప్పటి వరకు బూత్‌, బ్లాక్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎలక్టోరల్‌ రోల్‌ను పబ్లిష్‌ చేయలేదని విమర్శించారు ఆజాద్. పార్టీలో జరుగుతున్న భారీ మోసానికి ఏఐసీసీ నాయకత్వమే బాధ్యత వహించాలన్నారు. భారత్‌ స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి తగునా అనే విషయంపై అధినాయకత్వం తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలని ఆజాద్‌ సూచించారు.

అందుకే ఆజాద్​ రాజీనామా చేశారా?
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్​ పార్టీలో సంస్థాగత మార్పుల కోసం పట్టుబడుతున్న నేతల్లో గులాంనబీ ఆజాద్‌ ఒకరు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలుగా ముద్రపడిన జీ23 బృందానికి ఆజాద్‌ నేతృత్వం వహించారు. పార్టీని పూర్తిగా సంస్కరించాలంటూ 2020లో అధినేత్రి సోనియాగాంధీకి ఆయన లేఖ రాశారు. పూర్తిస్థాయి అధ్యక్షుడిని వీలైనంత త్వరగా నియమించాలని డిమాండ్‌ కూడా చేశారు. అయితే అప్పటి నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో పార్టీ విఫలం కావడం వల్ల ఆజాద్‌ కాంగ్రెస్‌ నుంచి పూర్తిగా వైదొలిగినట్లు తెలుస్తోంది.

అది జరిగిన పది రోజులకే..
ఆజాద్ రాజ్యసభ పదవీకాలం గతేడాది ముగియగా ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను పెద్దల సభకు పంపలేదు. చాలాకాలంగా కాంగ్రెస్​కు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు ఆజాద్. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా సోనియా గాంధీ అప్పగించిన బాధ్యతలను ఆయన తిరస్కరించారు. జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీని పునర్వవస్థీకరించే చర్యల్లో భాగంగా నియా గాంధీ గులాం నబీ ఆజాద్‌ను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు.

ఆజాద్ సన్నిహితుడైన వికార్ రసూల్‌ వానీని జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమించారు. అయితే నియమించిన కొద్ది సేపటికే ఆఫర్‌ను ఆజాద్‌ తిరస్కరించారు. ఆరోగ్య కారణాలతో ఆజాద్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉండటానికి నిరాకరించారని ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలియజేశారని కాంగ్రెస్ వర్గాలు అప్పట్లో చెప్పాయి. ఇదంతా జరిగిన పది రోజులకే కాంగ్రెస్​తో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు ఆజాద్.

Last Updated :Aug 26, 2022, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.