ETV Bharat / bharat

'చేతగానివారిలా ఉంటేనే ఆ పార్టీలో చోటు'.. కాంగ్రెస్​పై ఆజాద్​ ఫైర్

author img

By

Published : Apr 6, 2023, 9:30 AM IST

Updated : Apr 6, 2023, 10:19 AM IST

కాంగ్రెస్​ పార్టీ, రాహుల్​ గాంధీపై.. ఆ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి​ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో సహా మరికొందరు సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీని వీడటానికి కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌ గాంధీయే ముఖ్య కారణమని అన్నారు. చేతగానివారిలా ఉంటేనే ఆ పార్టీలో చోటు అని ఆజాద్ విమర్శించారు.

ghulam nabi azad comments rahul gandhi
ghulam nabi azad comments rahul gandhi

కాంగ్రెస్​ పార్టీ, రాహుల్​ గాంధీపై డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో సహా మరికొందరు సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీని వీడటానికి రాహుల్‌ గాంధీయే ముఖ్య కారణమని అన్నారు. ఆ పార్టీలో కొనసాగాలంటే వెన్నెముక లేని వ్యక్తిగా ఉండాలని చెప్పారు. తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరుకున్నప్పటికీ వారి చేతిలో ఏమీలేదని అన్నారు.

తన చేరికను రాహుల్‌ కోరుకున్నా.. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని ఆజాద్ అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆజాద్​ చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో అంటరానితనం లేదని.. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే బీజేపీతో చేతులు కలుపుతానని పరోక్షంగా తెలిపారు.

"ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ పనిచేసిన దాంట్లో 1/50 పని చేసినా రాహుల్​ సక్సెస్​ అయ్యేవారు. రాజకీయాలంటే.. మొదట పార్టీ, ప్రజలు, దేశం పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. 2013లో కాంగ్రెస్​ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్​ను చింపేయకుండా ఉంటే.. ఈరోజు రాహుల్​ గాంధీ అనర్హత నుంచి బయటపడేవారు. అయితే, అప్పుడు ఉన్నది బలహీనమైన క్యాబినెట్​. రాహుల్​ గాంధీ తిరస్కరించినా.. ఆ చట్టాన్ని తీసుకురావాల్సింది. అప్పుడు కాంగ్రెస్​ పార్టీ తప్పు చేసింది. ఆ సమయంలో నేను ఏం మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. "

--గులాం నబీ ఆజాద్‌, డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ అధ్యక్షుడు

తాజాగా ఆయన 'ఆజాద్‌-యాన్‌ ఆటోబయోగ్రఫీ' అనే పేరుతో ఓ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ట్విట్టర్​లో రాజకీయాలు చేసేవారికంటే.. నేను 2000 శాతం కాంగ్రెస్​ వాదినని అజాద్​ అన్నారు. మళ్లీ కాంగ్రెస్​లో జాయిన్​ అవుతారా? అని అడిగిన ప్రశ్నకు.. 'నాలాంటి వ్యక్తులు వారికి అవసరం లేదు. ట్విట్టర్​లో ఫాస్ట్​గా ఉన్న వారు, భారత్​ జోడో యాత్ర తర్వాత పార్టీ 500 సీట్లు గెలుస్తుందని అన్నవారే కాంగ్రెస్​కు కావాలి' అని చురకలంటించారు.

ఆజాద్​ చేసిన వాఖ్యలపై కాంగ్రెస్​ పార్టీ స్పందించింది. గులాం నబీ ఆజాద్‌, జ్యోతిరాదిత్య సింధియాలు పార్టీ ద్వారా చాలా లబ్ధిపొందారని కాంగ్రెస్‌ తెలిపింది. కాగా, వారిద్దరూ తమ నిజస్వరూపాలను బయటపెట్టుకోవడం ద్వారా.. కాంగ్రెస్​ పార్టీ చేసిన లబ్ధికి తాము అనర్హులమని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని ఆక్షేపించింది.
కాగా, దశాబ్దాలుగా కాంగ్రెస్​లో ఉండి గతేడాది వేరుకుంపటి పెట్టారు గులాం నబీ ఆజాద్. 'డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ'ని ఆయన స్థాపించారు.

Last Updated :Apr 6, 2023, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.