ETV Bharat / bharat

మురికివాడలో మంటలు.. ఒకే కుటుంబంలోని నలుగురు చిన్నారులు సజీవదహనం

author img

By

Published : Feb 9, 2023, 11:07 AM IST

Updated : Feb 9, 2023, 11:51 AM IST

Four children died in fire
Four children died in fire

మురికివాడలో మంటలు చెలరేగి.. ఒకే కుటుంబంలోని నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. హిమాచల్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో రోడ్డు పక్కన ఉన్న ఉద్యోగులపైకి బస్సు దూసుకెళ్లడం వల్ల నలుగురు అక్కడికక్కడే మరణించారు.

హిమాచల్​ప్రదేశ్​లోని ఉనా జిల్లాలో విషాదం నెలకొంది. మురికివాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బనే డి హట్టి ప్రాంతంలోని మురికివాడలో బుధవారం రాత్రి 11 గంటల తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బిహార్​కు చెందిన కూలీ కుటుంబం అక్కడే నిద్రిస్తోంది. మంటలు గమనించిన స్థానికులు.. అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే నలుగురు పిల్లలు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన చిన్నారులు తోబుట్టువులని పోలీసులు తెలిపారు.

ఉద్యోగులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. రోడ్డు పక్కన బస్సు కోసం వేచి చూస్తున్న ఉద్యోగులపైకి మరో బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.

పోలీసుల సమాచారం ప్రకారం..
బాదల్​పుర్​ పోలీస్​స్టేషన్ పరిధిలో హీరో మోటర్స్​ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు.. తమ షిఫ్ట్​ అయిపోయాక రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు మీద వేచి ఉన్నారు. అదే సమయంలో దాద్రీ నుంచి నోయిడా డిపోకు వెళ్తున్న ఓ బస్సు.. వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కిడకిక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

మరణించిన వారిలో ముగ్గురు బిహార్​కు చెందిన ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. నలుగురి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిని నిఠారీ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం దిల్లీలో సఫ్దర్​జంగ్ హాస్పిటల్​కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్​ కోసం గాలిస్తున్నారు.

రూమ్​లో బొగ్గుల కుంపటి.. ఊపిరాడక ఐదుగురు మృతి
జమ్ముకశ్మీర్​లో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబంలోని ఐదుగురు ఊపిరాడక మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు.. మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కశ్మీర్​ బయలుదేరారు.

పోలీసుల వివరాలు ఇలా..
ఉత్తర్​ప్రదేశ్​లో బిజ్నౌర్​ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. భార్యాపిల్లలతో జీవనోపాధి నిమిత్తం కశ్మీర్​కు వలస వెళ్లాడు. అక్కడ ఓ సెలూన్​లో పనిచేస్తున్నారు. ఇటీవలే అతడి భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ నవజాత శిశువుకు వెచ్చదనాన్ని అందించేందుకు గదిలో బొగ్గుల కుంపటి వెలిగించారు. గది తలుపులు మూసివేశారు. ఆ తర్వాత పొగ కారణంగా ఊపిరాడక ఐదుగురూ చనిపోయారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

లాడ్జిలో దంపతుల ఆత్మహత్య..
కర్ణాటక.. మంగళూరులోని ఓ లాడ్జిలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన రవీంద్రన్​, సుధగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు ఏం చెప్పారంటే?.. నగరంలోని హోటల్​ న్యూ బ్లూ స్టార్​ లాడ్జికి రవీంద్రన్​, సుధ దంపతులు.. ఫిబ్రవరి 6న వచ్చారు. ఆధార్​ కార్డులు చూపించి గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే మంగళవారం నుంచి దంపతులిద్దరూ.. బయటకు రాకపోవడాన్ని గమనించిన సిబ్బంది తలుపు తట్టారు.

ఎటువంటి సమాధానం రాకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా.. దంపతులిద్దరూ ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించారు. అయితే వీరు ఫిబ్రవరి 6న ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated :Feb 9, 2023, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.