ETV Bharat / bharat

కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఓకే.. ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం

author img

By

Published : Feb 4, 2023, 6:58 PM IST

Updated : Feb 4, 2023, 10:01 PM IST

Supreme Court
Supreme Court

సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జీల నియమకానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. కొత్తగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన వారు ఫిబ్రవరి 6న ప్రమాణ స్వీకారం చేస్తారని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.

సుప్రీంకోర్టులో జడ్జీల నియామకానికి గతేడాది డిసెంబరులో కొలీజియం చేసిన అయిదు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఐదుగురు హైకోర్టు జడ్జీల పేర్లను డిసెంబరు 13న కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, పట్నా హైకోర్టు సీజే జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, మణిపుర్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎహసానుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ ఐదుగురు న్యాయమూర్తుల పేర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తితోపాటు మొత్తం 34 మంది జడ్జీల నియామక సామర్థ్యం ఉన్న సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కి పెరిగింది.

ఈనెల 6న ప్రమాణం..
సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులు ఫిబ్రవరి 6న ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. అత్యున్నత న్యాయస్థానం ప్రాంగణంలో కొత్తగా నియమితులైన న్యాయమూర్తులతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని పేర్కొన్నాయి.

అంతకుముందు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జీల నియామకానికి గత డిసెంబరులో కొలీజియం చేసిన అయిదు సిఫార్సులకు త్వరలో ఆమోదముద్ర వేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌.వెంకటరమణి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా.. హైకోర్టు జడ్జీల పదోన్నతుల విషయంలో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం..'ఇది చాలా తీవ్రమైన విషయం. మరీ అసౌకర్యం కలిగించే నిర్ణయం తీసుకునేలా మమ్మల్ని ప్రోత్సహించవద్దు' అని ఏజీకి స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఐదుగురు న్యాయమూర్తుల నియామకాలనికి కేంద్రం ఆమోదం తెలిపింది.

Last Updated :Feb 4, 2023, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.