ETV Bharat / bharat

విషాదం.. టపాసులు పేలి తండ్రీకొడుకులు మృతి

author img

By

Published : Nov 5, 2021, 6:49 AM IST

Updated : Nov 5, 2021, 2:06 PM IST

crime news on diwali
పండగ వేళ అపశ్రుతి

దీపావళి పండగ వేళ ద్విచక్రవాహనంపై బాణసంచా తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు సహా అతని తండ్రి మృతి చెందారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. హరియాణాలో జరిగిన మరో ఘటనలో బాణసంచా కాల్చడంపై చెలరేగిన వాగ్వాదం.. ఒకరి హత్యకు దారి తీసింది.

విషాదం.. టపాసులు పేలి తండ్రీకొడుకులు మృతి

తమ జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని కాంక్షిస్తూ ప్రజలంతా దీపావళి పండగ ఘనంగా జరుపుకున్నారు. అయితే.. కొందరి జీవితాల్లో మత్రం అదే పండగ పూట విషాదం అలముకొంది. బైక్​పై బాణసంచా తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు మంటల చెలరేగాయి. దీంతో ఏడేళ్ల బాలుడు సహా అతని తండ్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.

అసలేమైందంటే...?

పుదుచ్చేరిలోని అరియాన్​కుప్పమ్ ప్రాంతానికి చెందిన కాలైనేశన్​(32).. తమిళనాడు మరక్కనమ్​లో బాణసంచా కొనుగోలు చేశాడు. వాటిని రెండు సంచుల్లో నింపుకొని గురువారం తన ఏడేళ్ల కుమారుడితో కలిసి బైక్​పై తిరిగి అరియాన్​కుప్పమ్​కు బయల్దేరాడు. ఈ క్రమంలో తమిళనాడు విల్లుపురం జిల్లా కొట్టాకుపురం వద్ద మంటలు చెలరేగి టపాసులు పేలాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

crime news on diwali
మృతులు కాలైనేశన్​, అతని కుమారుడు

అదే దారిలో వెళ్తున్న మరో ఇద్దరికీ కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనతో రహదారిపై రెండు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ లారీ సహా ఇతర వాహనాలు ప్రమాదంలో దెబ్బతిన్నాయి. విల్లుపురం, పుదుచ్చేరి అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాలైనేశన్​ కొనుగోలు చేసిన బాణసంచాను పరిశీలిస్తున్నారు.

crime news on diwali
బాణసంచా పేలి దగ్ధమైన వాహనం

బాణసంచా ఘర్షణ

హరియాణా సోనిపత్ జిల్లాలో దారుణం జరిగింది. బాణసంచా కాల్చడం వల్ల చెలరేగిన ఘర్షణ ఇద్దరు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది.

సైనిపుర ప్రాంతానికి చెందిన శ్యామ్ సింగ్​కు ముగ్గురు కుమారులు. దీపావళిని పురస్కరించుకుని బుధవారం రాత్రి శ్యామ్ సింగ్​ కుమారుడు సచిన్​... తమ ఇంటిబయట వీధిలో బాణసంచాను కాల్చాడు. ఈ క్రమంలో పొరుగింటి వ్యక్తి మోహిత్​ అలియాస్​ లిమా, తన సోదరుడు మనీశ్​తో కలిసి వచ్చి.. శ్యామ్​సింగ్ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. ఆపై ఆగ్రహానికి గురైన అతడు... శ్యామ్ సింగ్​తో పాటు​ అతని కుమారులపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనలో శ్యామ్ సింగ్​ కుమారుడు గౌరవ్​ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు శ్యామ్ సింగ్​.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సచిన్​కు, మోహిత్​కు మధ్య నెల రోజుల నుంచి వివాదం కొనసాగుతోందని పోలీసులకు శ్యామ్ సింగ్​ తెలిపాడు. పాత కక్షలతోనే మోహిత్ ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

ఒడిశాలో ఇద్దరు మృతి

ఒడిశాలో దీపావళి టపాసులు పేలడం కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. డేంకానల్ జిల్లాలో బాణసంచా బ్యాగును పట్టుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

కేంద్రపడా జిల్లాలో మరో విషాద ఘటన జరిగింది. జుదాస్​పుర్​ గ్రామంలో ఓ వ్యక్తి తన ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా.. పేలుడు సంభవించింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ఓ వినియోగదారుడికి కూడా గాయాలయ్యాయి.

ఇదీ చూడండి: రాముడికి ముస్లిం మహిళ హారతి.. 15 ఏళ్ల సంప్రదాయం కొనసాగిస్తూ...

Last Updated :Nov 5, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.