ETV Bharat / bharat

'ఆ బిడ్డ నాకు పుట్టలేదు'.. 26రోజుల శిశువుపై తండ్రి కర్కశం.. బ్లేడుతో మెడ, చెయ్యి కోసి..

author img

By

Published : Jul 11, 2023, 1:31 PM IST

26 రోజుల పసికందు పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. పుట్టిన శిశువు తన సంతానం కాదని అనుమానిస్తూ చిన్నారిపై దాడి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.

father doubts his paternity
father doubting paternity

పుట్టిన బిడ్డ తన సంతానమో కాదో అన్న అనుమానంతో ఓ వ్యక్తి.. 26 రోజుల వయసున్న శిశువు పట్ల దారుణంగా ప్రవర్తించాడు. భార్య మీద కోపంతో శిశువు మెడ, చెయ్యిని బ్లేడుతో కోసేశాడు. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. కేరళలోని వేలూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం చిన్నారి జిల్లాలోని అడుక్కంపరాయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని మణికందన్​గా గుర్తించారు పోలీసులు. అతడు భారత నావికాదళం ఉద్యోగి అని తెలిపారు. చెన్నైలోని తంబరం సెక్షన్​లో అతడు పనిచేస్తున్నట్లు వివరించారు.

అతడికి 30.. ఆమెకు 21..
అనైకట్టు తాలుకాలోని దేవిచెట్టికుప్పం ప్రాంతానికి చెందిన మణికందన్​(30)కు గతేడాది సెప్టెంబర్​లో హేమలత(21) అనే యువతితో వివాహమైంది. ఆమె గర్భిణీగా ఉన్న సమయంలో పని నిమిత్తం అతడు ఇంటికి దూరంగా వెళ్లిపోయాడు. ఈ సమయంలో హేమలత తన తల్లి ఊరైన రెట్టియూర్ గ్రామానికి వెళ్లిపోయింది. కాగా, 26 రోజుల క్రితం హేమలత ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

మణికందన్ తన బిడ్డను చూసుకునేందుకు గత ఆదివారం రెట్టియూర్​కు వచ్చాడు. అయితే, శిశువును చూసిన తర్వాత తన భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. 'శిశువు చూడటానికి నాలా కనిపించడం లేదు. ఈ బిడ్డ నాకు పుట్టలేదు' అంటూ తన భార్య హేమలతతో వాదించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. కోపం పెంచుకున్న మణికందన్.. శిశువు మెడపై బ్లేడుతో దాడి చేశాడు. చిన్నారి కుడి చెయ్యిపైనా బ్లేడుతో కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

నియోనేటల్ ఐసీయూలో చికిత్స
శిశువు తల్లి హేమలత.. తన బంధువులు, స్థానికులతో కలిసి చిన్నారిని అనైకట్టులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రాథమిక చికిత్స అనంతరం చిన్నారిని అడుక్కంపరాయ్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువుకు.. ఆస్పత్రిలోని నియోనేటల్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు శిశువు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
మరోవైపు, బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై అనైకట్టు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. నిందితుడు మణికందన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.