ETV Bharat / bharat

'ఈ నెల 26లోగా సాగు చట్టాలు రద్దు చేయండి.. లేదంటే...'

author img

By

Published : Nov 1, 2021, 6:52 PM IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రానికి నవంబర్ 26 వరకు గడువు ఇచ్చారు బీకేయూ నేత రాకేశ్ టికాయిత్. లేదంటే మరింత మంది రైతులు తరలివచ్చి, తమ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తారని హెచ్చరించారు.

Tikait
రాకేష్ టికాయిత్

రైతుల అందోళనలకు ఏడాది పూర్తవనున్న నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింగు, టిక్రి, గాజీపుర్​లో రైతుల నిరసన మొదలై నవంబరు 26కి సంవత్సరం పూర్తవుతుందని.. ఈలోగా వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించారు.

"చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 వరకు సమయం ఉంది. ఉపసంహరించుకోకపోతే ఆ తర్వాత రోజే రైతులు గ్రామాల నుంచి ట్రాక్టర్లలో బయలుదేరి దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకుంటారు. మా ఉద్యమ స్థలంలో శిబిరాలను మరింత బలోపేతం చేస్తారు."

-రాకేశ్ టికాయిత్

సాగు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు తమ నిరసనను విరమించేది లేదని బీకేయూ ప్రతినిధి సౌరభ్ ఉపాధ్యాయ స్పష్టం చేశారు.

"మోదీ ప్రభుత్వం సాగు చట్టాలను ఈరోజు వెనక్కి తీసుకుంటే మా నిరసన ఇప్పుడే ముగుస్తుంది. అయితే మరో 10 సంవత్సరాలు అవి కొనసాగినా ఫర్వాలేదు. ఎందుకంటే మా నిరసన సైతం నిరంతరాయంగా కొనసాగుతుంది."

-సౌరభ్ ఉపాధ్యాయ, బీకేయూ ప్రతినిధి

నిరసనకారులు దేశ రాజధాని వైపు వెళ్లకుండా దిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌ వేపై గాజీపుర్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల తొలగింపు ప్రక్రియ సుప్రీంకోర్టు జోక్యంతో ఇటీవలే ప్రారంభమైంది. 'వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని సరిహద్దుల్లో నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని.. అయితే ఆందోళనల పేరిట రహదారులను అడ్డుకోవద్దు' అని రైతులకు సుప్రీంకోర్టు అక్టోబర్ 21న సూచించింది.

వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా 2020లో కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ.. రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. మరోవైపు.. ఈ చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని కేంద్రం చెబుతూ వస్తోంది. వీటిపై రైతులతో 11 దఫాలు చర్చలు కూడా జరిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.