ETV Bharat / bharat

'మాది ప్రజా ఉద్యమం.. ఎప్పటికీ ఓడిపోదు'

author img

By

Published : Feb 7, 2021, 5:15 PM IST

Updated : Feb 7, 2021, 10:09 PM IST

నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసేంతవరకు తాము ఇళ్లకు వెళ్లేది లేదని భారతీయ కిసాన్​ యూనియన్​ ప్రతినిధి రాకేశ్​ టికాయిత్​ పేర్కొన్నారు. తమ ఉద్యమంలో చీలికలు సృష్టించేందుకు కొంత మంది ప్రయత్నించినప్పటికీ.. తామంతా కలిసికట్టుగానే ఉన్నామని చెప్పారు. తమది ప్రజా ఉద్యమమని.. అది ఎప్పటికీ ఓడిపోదన్నారు.

farmer protest
'మీ ఉద్యోగాలనే వదిలేయాలంటే ఏం జరుగుతుంది?'

నూతన సాగు చట్టాల రద్దు కోసం రైతులు చేస్తోన్న ఉద్యమం.. ప్రజా ఉద్యమం అని భారతీయ కిసాన్ యూనియన్​(బీకేయూ) నేత రాకేశ్​ టికాయిత్​ అభివర్ణించారు. అది ఎప్పటికీ ఓడిపోదు అని పేర్కొన్నారు. చట్టాలను రద్దు చేసే వరకు ఇళ్లకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. హరియాణాలోని చర్ఖి దాద్రిలో నిర్వహించిన కిసాన్​ మహా పంచాయత్​ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రైతుల ఉద్యమంలో ఖాప్​ పంచాయత్​(క్యాస్ట్​ కౌన్సిల్​) పాత్ర కీలకం అని పేర్కొన్నారు.

"వివాదాస్పద సాగు చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. ఇటీవల అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలి. ఇది ప్రజా ఉద్యమం.. ఎప్పటికీ ఓడిపోదు. రైతుల ఉద్యమం రోజురోజుకు బలపడుతోంది.

-రాకేశ్​ టికాయిత్​, బీకేయూ నేత

ఉద్యమాన్ని అణచివేయడానికి కొంత మంది తమను సిక్కులు, సిక్కేతరులు, జాట్​లు, జాటేతరలుగా విభజించేందుకు యత్నించారని టికాయిత్​ అన్నారు. కానీ, తామంతా ఐకమత్యంగానే ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దాద్రి ఎమ్మెల్యే, సంగ్వాన్​ ఖాప్​ అధ్యక్షుడు సోంబీర్​ సంగ్వాన్​, మరో స్వతంత్ర ఎమ్మెల్యే బాల్​రాజ్​ కుందు పాల్గొన్నారు.

అలా అంటే ఏం జరుగుతుంది?

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మాత్రమే యువత అడుగుతోందని.. రాకేశ్​ టికాయిత్​ అన్నారు. మీ(ప్రభుత్వం) పదవులనే వదిలేయాలని వాళ్లు నినదిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చట్టాలను రద్దు చేసేందుకు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేందుకు ఇంకా సమయం ఉందని రాకేశ్​ టికాయిత్​ చెప్పారు. ట్రాక్టర్​ ర్యాలీలో రైతులను కుట్రపూరితంగా ఎర్రకోట వైపు తరలించిన ఘటనను సహించేది లేదని పేర్కొన్నారు.

'ఇది పెట్టుబడిదారి ప్రభుత్వం'

రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న 40 మంది నేతలకు నమస్కరిస్తున్నానని టికాయిత్ అన్నారు. 'వేదికలు మారవు, నాయకులు మారరు' అని పేర్కొన్నారు. ప్రస్తుత ఉన్నది పెట్టుబడిదారి ప్రభుత్వం అని టికాయిత్​ వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్​ వరదల ఘటనపై టికాయిత్​ విచారం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలకు రైతు సంఘాలు సాయం అందించాలని కోరారు.

అవి రైతులను నాశనం చేస్తాయి..

నుహ్​ జిల్లా సునేదాలో మరో 'కిసాన్ పంచాయత్​'ను రైతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీకేయూ ఛీఫ్​ గుర్నామ్​ సింగ్​ చదౌనీ హాజరయ్యారు. సాగు చట్టాల పట్ల కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిని తప్పుబట్టారు. రైతులను ఆ చట్టాలు నాశనం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నేత అఫ్తబ్​ అహ్మద్ పాల్గొన్నారు. ​

ఇదీ చదవండి:టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య

Last Updated :Feb 7, 2021, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.