'ప్రధాని అభ్యర్థిగా నీతీశ్ కుమార్​'.. పీకే కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Aug 10, 2022, 5:39 PM IST

prashant kishor bihar politics
'తదుపరి ప్రధాని అభ్యర్థి నీతీశ్ కుమార్​'.. పీకే సంచలన వ్యాఖ్యలు ()

Prashant Kishor Bihar Politics: భాజపాతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అసౌకర్యంగానే ఉన్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అలాగే తాజాగా ఏర్పడిన జేడీయూ- ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కీలకంగా వ్యవహరిస్తారని జోస్యం చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నీతీశ్​ కుమార్‌ను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.

'తదుపరి ప్రధాని అభ్యర్థి నీతీశ్ కుమార్​'.. పీకే సంచలన వ్యాఖ్యలు

Prashant Kishor Bihar Politics: బిహార్​లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. అయితే బిహార్​లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. రాష్ట్రంలో గత 12-13 సంవత్సరాలుగా రాజకీయ అస్థిరత ఉందని పీకే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏదైనా ముఖ్యమంత్రిగా నీతీశ్​ కుమార్ ఒక్కరే కొనసాగుతున్నారని అన్నారు. 2012-13 నుంచి ఇప్పటివరకు బిహార్ ప్రభుత్వ ఏర్పాటులో ఆరు ప్రయోగాలు జరిగాయని వెల్లడించారు. తాజాగా ఏర్పడిన జేడీయూ- ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేశారు. బిహార్ మినహా.. మిగతా రాష్ట్రాల్లో నీతీశ్​కు ఆదరణ లేదని అభిప్రాయపడ్డారు ప్రశాంత్ కిశోర్.

నీతీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ- భాజపా సంకీర్ణ కూటమిపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం లేదు. తాజాగా జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ అజెండా ఏమిటనేది తేలాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నీతీశ్​ కుమార్‌ను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదు. భాజపాతో జత కట్టిన తరువాత నీతీశ్ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేరు. తాజాగా జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల వంటి ఏడు పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమి కూడా ఇంతకుముందులా ప్రభావం చూపదు.

-ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త

2017 నుంచి 2022 వరకు నీతీశ్.. భాజపాతోనే ఉన్నారని అన్నారు ప్రశాంత్ కిశోర్. ప్రస్తుతం మహాఘట్​బంధన్​తో మరోసారి ప్రయోగాలు చేద్దామని ఆయన భావించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈసారైనా నీతీశ్ కుమార్.. బిహార్ ప్రజల ఆశయాలను నెరవేర్చుతారని ఆశిస్తున్నానని చెప్పారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం.. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుందో లేదో చూడాలని పీకే అన్నారు.

అనూహ్య మలుపులతో..
భాజపా అధినాయకత్వంపై కొన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్న నీతీశ్ కుమార్‌.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. ఆ కూటమి నుంచి బయటకు వచ్చి మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన కాసేపటికే మహాకూటమితో పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ప్రత్యర్థి ఆర్జేడీ పార్టీతో మళ్లీ చేతులు కలిపారు. 7 పార్టీలతో కూడిన మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలంటూ గవర్నర్‌ను కోరారు. అందుకు ఆయన ఆమోదించడం వల్ల బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

ఆర్జేడీ నేతకు స్పీకర్ పదవి?
పొత్తులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆర్జేడీ నుంచి మరో నేతకు స్పీకర్‌ పదవి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక, మరో మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. 2015లో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ నీతీశ్‌ సీఎంగా ఉండగా.. తేజస్వీ యాదవ్‌ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. లాలూ మరో తనయుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు అప్పుడు మంత్రి పదవి దక్కగా.. కొత్త ప్రభుత్వంలోనూ మరోసారి మంత్రిత్వ శాఖలను అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: నీతీశ్​ దెబ్బకు భాజపాకు కొత్త కష్టాలు.. కీలకంగా వైకాపా!

సూక్ష్మ కళాకారుడి దేశభక్తి.. కంటిలో జాతీయ జెండా పెయింటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.