జులై 18న రాష్ట్రపతి ఎన్నిక.. 21న ఓట్ల లెక్కింపు

author img

By

Published : Jun 9, 2022, 3:29 PM IST

Updated : Jun 9, 2022, 4:37 PM IST

Election Commission announce presidential poll schedule

దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగింది. దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్​ ఖారారైంది. జులై 18న తేదీన పోలింగ్​ నిర్వహించనున్నట్లు(ఏకగ్రీవం కాకపోతే) కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షెడ్యూల్​ను సీఈసీ రాజీవ్​ కుమార్​ వెల్లడించారు. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలలో పోలింగ్‌ జరగుతుందని సీఈసీ చెప్పారు. ఎన్నిలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారని వివరించారు. ఓటింగ్‌లో పాల్గొనే ఓటర్ల మొత్తం ఓట్ల విలువ 10,86,431 అని సీఈసీ తెలిపారు. నామినేషన్‌ వేసే అభ్యర్థిని కనీసం 50 మంది బలపరచాలని పేర్కొన్నారు.

షెడ్యూల్​ ఇదే..

  • జూన్‌ 15న నోటిఫికేషన్ విడుదల
  • జూన్​ 29 వరకు నామినేషన్‌ దాఖలుకు గడువు
  • జూన్​ 30న నామినేషన్‌ పరిశీలన
  • జులై 2న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
  • జులై 18న పోలింగ్(ఏకగ్రీవం కాకపోతే)
  • జులై 21న ఓట్ల లెక్కింపు
  • జులై 25 కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం

ఎలక్టోరల్‌ కాలేజీ పద్ధతిలో..

రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్‌ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరు ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుడిని ఎన్నుకొంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్‌ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు.

6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టిన వారందరూ జులై 25వ తేదీనే ప్రమాణస్వీకారం చేశారు. కొత్త రాష్ట్రపతి కూడా అదే తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్‌ జారీచేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

ఓటింగ్‌.. రహస్య బ్యాలట్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది. ఓటింగ్‌ చేయాల్సిన పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయాల్సి ఉంటుంది. వేరే దాంతో వేస్తే అది రద్దవుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్‌ కాలేజీ మొత్తం ఓట్ల విలువలో ఎన్డీఏకు 49శాతం, యూపీఏకు 24.02శాతం, ఇతర పార్టీలకు 26.98శాతం బలం ఉంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీఏ బలం కొంత ఎక్కువగానే ఉంది.

గతంలో ఎన్డీఏ కూటమి పార్టీలతోపాటు, బయట నుంచి ఏఐఏడీఎంకే, వైకాపా, జేడీయూ, బీజేడీ, తెరాస, ఐఎన్‌ఎల్‌డీ, స్వతంత్రులు మద్దతివ్వడంతో రామ్‌నాథ్‌ కోవింద్‌కు 7,02,044 (65.65శాతం) ఓట్లు, యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌కు 3,67,314 (34.35శాతం) ఓట్లు వచ్చాయి. క్రితంసారి తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్పీ, ఆర్‌జేడీ లాంటి పార్టీలు యూపీఏ అభ్యర్థికి మద్దతిచ్చాయి.

2017లో ఇలా..

2017లో 15వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం జూన్‌ 7వ తేదీన షెడ్యూల్‌ విడుదల చేసింది. అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ నసీం అహ్మద్‌ జైదీ తేదీలను ప్రకటించారు. ఆ ఏడాది జూన్‌ 14 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 28వ తేదీతో ముగిసింది. జులై 17న పోలింగ్‌, 20న కౌంటింగ్‌ జరిగింది. జులై 25వ తేదీన రామ్‌నాథ్‌ కోవింద్‌ చేత అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహార్‌ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయించారు.

ఇదీ చదవండి: 'ఆలస్యం ఏం లేదు.. రెండు రోజుల్లో వానలే వానలు'

Last Updated :Jun 9, 2022, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.