సంజయ్ రౌత్ ఇంటి నుంచి నగదు స్వాధీనం.. ప్రత్యేక కవర్​లో రూ.10 లక్షలు!

author img

By

Published : Aug 1, 2022, 1:00 PM IST

sanjay raut ed

Sanjay raut ED: పాత్రాచాల్ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్​ను ఈడీ ఆదివారం అరెస్టు చేశారు. సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. రౌత్ ఇంట్లో రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలను ప్రత్యేకంగా ఒక కవర్‌లో ఉంచినట్లు వారు గుర్తించారు. ఆ కవర్‌పై ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే పేరు రాసి ఉంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రౌత్​ను ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నప్పుడు ఆయన తల్లి హారతి ఇచ్చి తిలకం దిద్దారు.

Sanjay raut ED: పాత్రాచల్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శివసేన నేత సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసింది. ఆదివారం రౌత్‌ ఇంట్లో 9 గంటల పాటు సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ అధికారులు రూ.11.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలు ప్రత్యేక కవర్‌లో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో సోదాల తర్వాత ముంబయిలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఆయన్ను ఆరు గంటల పాటు ప్రశ్నించారు. అయితే, రౌత్‌ విచారణకు సహకరించడంలేదని ఆదివారం అర్ధరాత్రి 12.05 గంటలకు ఈడీ ఆయన్ను కస్టడీలోకి తీసుకుంది.

ఇంటివద్ద అమ్మ సెంటిమెంట్‌..
పాత్రాచాల్‌ భూకుంభకోణంతో సంజయ్ రౌత్, ఆయన సతీమణి వర్షా రౌత్ మరికొంతమందికి సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్ల విలువచేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల విలువైన ఈ కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసు విషయమై రౌత్‌ను జులై 1న దాదాపు 10 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. మరో రెండు సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన హాజరు కాలేదు. ఆ నేపథ్యంలో ఆదివారం ఈడీ ఆకస్మిక సోదాలు చేపట్టింది. అనంతరం ఆయన్ను కార్యాలయానికి తరలించేటప్పుడు కొన్ని సెంటిమెంట్ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. బయటకు వెళ్తుండగా రౌత్ తల్లి ఆయనకు హారతి ఇచ్చి తిలకం దిద్దారు. ఆయనేమో తల్లి పాదాలకు నమస్కరించి, ఆమెను ఆలింగనం చేసుకున్నారు.

రూ.10 లక్షలు ప్రత్యేక కవర్‌లో..
ఆదివారం నిర్వహించిన సోదాల్లో భాగంగా రౌత్ ఇంట్లో అధికారులు రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలను ప్రత్యేకంగా ఒక కవర్‌లో ఉంచినట్లు వారు గుర్తించారు. ఆ కవర్‌పై ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే పేరు రాసి ఉంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొద్దిరోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే జరిపిన అయోధ్య పర్యటన నేపథ్యంలో ఆ డబ్బు శిందేకు ఇవ్వడానికి దీనిని పక్కనపెట్టినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఆ పర్యటనకు ఠాక్రేతో పాటు శిందే కూడా వెళ్లారు.

ఇదిలా ఉండగా.. ఈ రోజు సంజయ్‌ను పీఎంఎల్‌ఏ (నల్లధనం నిరోధక చట్టం) కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దాంతో ఆ కోర్టు పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. అలాగే ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ.. సంజయ్‌ను 10 రోజుల కస్టడీ ఇవ్వాలని అడగనున్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్టుపై భాజపాను విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తాము సంజయ్‌తోనే అంటూ కాంగ్రెస్ ఉద్ధవ్‌ వర్గానికి మద్దతు ప్రకటించింది.

ఇవీ చదవండి: 'నాకింకా పెళ్లి కాలేదు.. అబ్బాయి ఉంటే చెప్పండి'.. పాటలు పాడుతూ ఎంపీ రిక్వెస్ట్

ఘోరం.. కరెంట్​ షాక్​తో 10 మంది మృతి.. వ్యాన్​లోని డీజే సిస్టమ్​ వల్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.