ETV Bharat / bharat

డీజీ హత్య కేసులో పని మనిషి అరెస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు

author img

By

Published : Oct 4, 2022, 1:01 PM IST

జమ్ముకశ్మీర్​ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన అనుమానితుడైన పని మనిషిని అరెస్టు చేశారు.

Yasir Ahmed arrested
డీజీ హత్య కేసులో పని మనిషి అరెస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు

జమ్ముకశ్మీర్​ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా(57) హత్య కేసులో ప్రధాన అనుమానితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి డీజీ హత్య తర్వాత కనిపించకుండా పోయిన యసీర్ లోహర్​(23)ను అనేక గంటల సెర్చ్ ఆపరేషన్​ తర్వాత పట్టుకున్నారు. కన్హాచక్ ప్రాంతంలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు యసీర్ లోహర్.. రాంబాన్ జిల్లా హల్లా ధంద్రానాథ్​ గ్రామానికి చెందిన యువకుడు. దాదాపు 6 నెలలుగా అతడు హేమంత్ కుమార్ వద్ద పనిచేస్తున్నాడు. "భోజనం చేశాక డీజీ తన గదికి వెళ్లిపోయారు. అయితే.. ఆయనకు ఏదో ఆరోగ్య సమస్య ఉంది. సాయం పేరిట నిందితుడు.. హేమంత్ గదిలోకి వెళ్లాడు. లోపల నుంచి తాళం వేసి.. డీజీపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. నిందితుడు గతంలోనూ దురుసుగా వ్యవహరించేవాడని, మానసిక స్థిరత్వం లేదని తెలిసింది." అని యసీర్ అరెస్టుకు ముందు చెప్పారు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్ సింగ్.

యసీర్​ డైరీలో కీలక విషయాలు
హేమంత్ ఇంట్లో యసీర్ డైరీని పోలీసులు గుర్తించారు. అందులో తన భవిష్యత్తు, మరణం గురించి రాసిన రాతలు బట్టి.. అతడి ఆలోచనా ధోరణిని అంచనా వేశారు. ఆ మాటలను బట్టి అతడు డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి.

యసీర్​ డైరీలో హిందీ పాటలు ఉన్నాయని, అందులో ఒకటి "నన్ను మర్చిపో" పేరిట రాసి ఉందని పేర్కొన్నారు. "ఓ మరణమా.. నా జీవితంలోకి రా. ప్రస్తుతం నేను నాకు నచ్చని జీవితం జీవిస్తున్నాను. ఈ జీవితం నాకు నచ్చట్లేదు. జీవితం అంటే విషాదం మాత్రమే. ప్రేమ 0 శాతం, టెన్షన్ 90 శాతం, బాధ 99 శాతం, నకిలీ నవ్వు 100 శాతం. ప్రస్తుతం నేను బతుకుతున్న జీవితంతో నాకే సమస్యా లేదు. కానీ ఇబ్బంది అంతా భవిష్యత్తు గురించే" అని ఆ డైరీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. ప్రాథమిక దర్యాప్తులో ఉగ్రకోణం ఏమీ కనిపించలేదని, అయితే అన్ని కోణాల నుంచి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాయి.

1992 బ్యాచ్‌కు చెందిన హేమంత్ కుమార్ లోహియా.. ఆగస్టులో పదోన్నతి పొంది జమ్ముకశ్మీర్ జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాత్రి జమ్ము శివారు ప్రాంతమైన ఉదయ్​వాలాలోని ఆయన ఇంట్లోనే ఎవరో గొంతు కోసి, హత్య చేశారు. ఆ గదిలోనే డీజీ మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన అనంతరం హేమంత్ ఇంటి పని మనిషి జసీర్ కనిపించకుండా పోగా.. అతడే ప్రధాన అనుమానితుడని పోలీసులు భావించారు. అనేక గంటలపాటు గాలించి, అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.