ETV Bharat / bharat

'లైంగిక సామర్థ్యంపై ఆరోపణలు క్రూరత్వమే'

author img

By

Published : Nov 22, 2020, 6:52 AM IST

Delhi High court
లైంగిక సామర్థ్యంపై ఆరోపణలు క్రూరత్వమే

జీవిత భాగస్వామి లైంగిక సామర్థ్యంపై తప్పుడు ఆరోపణలు చేయడం క్రూరత్వమని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు స్వీయ ప్రతిష్ఠను, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని పేర్కొంది. తన భర్త సంసారానికి పనికి రాడంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన దిల్లీ న్యాయస్థానం.. ఈ మేరకు సదరు వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

సంసార జీవితంలో భాగస్వామి లైంగిక సామర్థ్యం గురించి తప్పుడు ప్రచారం చేయడం క్రూరత్వం కిందికే వస్తుందని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో దిగువ న్యాయస్థానం ఒక పురుషుడికి మంజూరు చేసిన విడాకుల్ని సమర్థించింది. రాతపూర్వక వాంగ్మూలంలో భర్తపై భార్య చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, ఆయన స్వీయ ప్రతిష్ఠను, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా అవి ఉన్నాయని.. జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ సంజీవ్‌ నరూలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. తన భర్త.. సంసారానికి పనికిరాడంటూ ఆమె చెప్పడం చట్ట ప్రకారం క్రూరత్వమేనని తేల్చిచెప్పింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆ మహిళ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇదీ కేసు..

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన జంటకు 2012లో వివాహమైంది. భర్తకు అప్పటికే ఒకసారి విడాకులయ్యాయి. భార్యకు మాత్రం అది మొదటి వివాహం. భార్య మానసిక ప్రవృత్తిని దాచిపెట్టి తనకు పెళ్లి చేశారని, అది తెలిసి ఉంటే వివాహమే చేసుకుని ఉండేవాడిని కాదని భర్త కోర్టుకు వెళ్లారు. దానిపై భార్య స్పందిస్తూ తన భర్తకు నపుంసకత్వం ఉందని ఆరోపించారు. ఆయనలో అలాంటి లోపమేమీ లేదని నిపుణులు సాక్ష్యం చెప్పాక ఆ ఆరోపణల్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. దానిపై ఆమె హైకోర్టుకు వెళ్లారు. తప్పుడు ఆరోపణల కారణంగా ఎంతో మానసిక వేదన అనుభవించిన భర్తను ఆమెతో సర్దుకుపోవాల్సిందిగా చెప్పలేమని, ఆ వివాహం పునరుద్ధరించలేని రీతిలో ముక్కలైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ముందు ఆరోపణలు చేసేటప్పుడు అలక్ష్యం తగదని, దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది.

ఇదీ చదవండి: సమన్వయంతో సంక్షోభాన్ని జయిద్దాం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.