ETV Bharat / bharat

యువతిని ఢీకొట్టి 12 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. ప్రమాదమా?.. కావాలనే చేశారా?

author img

By

Published : Jan 2, 2023, 3:20 PM IST

Updated : Jan 2, 2023, 4:58 PM IST

Delhi Girl Dragged Case
Delhi Girl Dragged Case

కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని దిల్లీలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. సుల్తాన్‌పురిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన కారు ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. యూటర్న్‌లు కూడా కొట్టింది. ఈ ఘటనలో యువతి శరీరం ఛిద్రమైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. కారు నంబరు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు.

యువతిని ఢీకొట్టి 12 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. ప్రమాదమా?.. కావాలనే చేశారా?

Delhi Girl Dragged Case : దిల్లీ సుల్తాన్‌పురిలో ఆదివారం తెల్లవారుజామున 20 ఏళ్ల యువతిని ఢీకొట్టిన కారు ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిలోమీటర్ల మేర యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె శరీరం ఛిద్రమైంది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని చూసిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించాడు. అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేసిన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.

'కారులో పాటలు పెట్టడం వల్లే..'
ఈలోగా రోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కారును గుర్తించిన పోలీసులు.. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో వారు మత్తులో ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు అద్దాలు మూసి ఉండటం, కారులో పాటలు పెట్టడం వల్ల ప్రమాదాన్ని గుర్తించలేకపోయినట్లు నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

'ప్రమాదం కాదు.. కావాలనే..'
యువతి శరీరాన్ని ఈడ్చుకుపోయిన కారు.. యూటర్న్ తీసుకున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో రికార్డయ్యాయి. యువతి మృతదేహం కంజావాలా రోడ్డులో జ్యోతి గ్రామం వద్ద కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. ఇది కేవలం ప్రమాదం కాకపోవచ్చని.. కావాలనే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. అప్పటికే మృతదేహం కారు చక్రాల వద్ద చిక్కుకుని ఉండగా కాళ్లు విరిగిపోయినట్లు తెలుస్తోంది. యువతిని కారు ఈడ్చుకెళ్లిన విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్​..
కిలోమీటర్ల మేర యువతిని కారు లాక్కెళ్లిన ఘటనపై దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయం విని తలకొట్టేసినట్లైందని ట్వీట్ చేశారు. నిందితుల భయంకరమైన ప్రవర్తన ఆందోళనకు గురిచేసిందన్న సక్సేనా.. ఘటనపై పోలీసులతో మాట్లాడినట్లు వివరించారు. ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు అని పేర్కొన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. దోషులను కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు నోటీసులిచ్చింది.

శవపరీక్ష కోసం వైద్యుల బృందం..
కొత్త సంవత్సరం వేళ దిల్లీలో జరిగిన దారుణఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితురాలి మృతదేహానికి శవపరీక్షల నిమిత్తం వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. పోస్ట్​మార్టం నివేదిక ఆధారంగా నిందితులపై అభియోగాలను చేర్చవచ్చని ఏసీపీ సాగర్ ప్రీత్​ హుడా తెలిపారు. బాధితురాలి కుటుంబానికి దర్యాప్తు గురించి అప్డేట్లు ఇస్తున్నామని, నిందితులుకు కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు. వాహనానికి ఫోరెన్సిక్ పరీక్షలు జరిగాయని చెప్పారు.

పోలీస్​స్టేషన్​ ఎదుట స్థానికుల ఆందోళన..
అంతకుముందు బాధితురాలికి న్యాయం చేయాలంటూ సుల్తాన్​పురి పోలీస్​స్టేషన్​ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనను యాక్సిడెంట్​ కేసుగా పోలీసులు పరిగణిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ కేసులో ఐదుగురు నిందితులకు మూడు రోజుల పోలీస్​ కస్టడీ విధించింది దిల్లీ కోర్టు.

Last Updated :Jan 2, 2023, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.