ETV Bharat / bharat

పెరోల్​పై విడుదలై.. తిరిగిరాని వేల మంది ఖైదీలు

author img

By

Published : Apr 17, 2021, 6:09 PM IST

కరోనా పడగవిప్పుతున్న వేళ.. దిల్లీలోని తిహాడ్ జైలు నుంచి విడుదలైన ఖైదీలు.. తిరిగిరాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వేల మంది ఖైదీల ఆచూకీ అధికారులకు తెలియకుండా పోయింది. దీంతో రాజధానిలో నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు మొదలయ్యాయి.

delhi prison
తిహాడ్ జైల్లో తిరిగిరాని వేల మంది ఖైదీలు

దేశమంతా కరోనాతో కకావికలమవుతుంటే.. దిల్లీ పోలీసులకు ఇంకో తలనొప్పి వచ్చి పడింది. వైరస్ ప్రభావంతో జైలు నుంచి ఖైదీలను విడుదల చేయగా.. వారిలో కొందరు తిరిగిరాకపోవడం సమస్యాత్మకంగా మారింది.

కరోనా కట్టడికి గతేడాది లాక్​డౌన్ విధించగా.. తిహాడ్ జైల్లోని 6,500 మంది ఖైదీలు పెరోల్, మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు. వీరిలో 3,400 మంది ఇప్పటివరకు తిరిగిరాలేదు. ఇందులో తీవ్రమైన నేరాలు చేసినవారు చాలా మంది ఉన్నారు. దిల్లీ పోలీసులకు, తిహాడ్ జైలు అధికారులకు వీరిని తిరిగి తీసుకురావడం కత్తిమీద సాములా మారింది. రాజధానిలో నేరాల పెరుగుదలలో వారి పాత్ర ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Delhi: Criminals out on parole during lockdown giving admins headache
తిహాడ్ జైలు ద్వారం

జైలులో కరోనా కేసులు ప్రారంభమైన సమయంలో.. ఇక్కడి ఖైదీల సంఖ్య కారాగార సామర్థ్యానికి ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేదని తిహాడ్ జైలు మాజీ న్యాయాధికారి సునీల్ గుప్తా తెలిపారు. జైలులో కరోనా కేసుల పెరుగుదలతో అప్రమత్తమై.. 6,500 మంది ఖైదీలను దశలవారీగా విడుదల చేసినట్లు చెప్పారు.

సంబంధిత కథనం: తిహార్​ జైలు నుంచి 3వేల మంది ఖైదీల విడుదల!

దిల్లీ ప్రభుత్వం, తిహాడ్ అధికారులు.. 1184 మంది ఖైదీలకు అత్యవసర పెరోల్ మంజూరు చేయగా.. 5,556 మంది ఖైదీలకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్​లో దిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల... ఖైదీలను తిరిగిరావాలని అధికారులు ఆదేశించారు. కానీ, 50 శాతానికిపైగా దోషులు ఇంకా సరెండర్ కాలేదు.

వీరంతా ఎక్కడికి వెళ్లినట్లు?

45 రోజుల మధ్యంతర బెయిల్​తో ఖైదీలను విడుదల చేసినప్పటికీ.. కరోనా కారణంగా.. ఈ గడువును అనేక సార్లు పెంచారని గుప్తా వెల్లడించారు. కొంతమంది ఖైదీలు సాధారణ బెయిల్ తీసుకొని ఉంటారని తెలిపారు. మరికొందరు న్యాయస్థానాల్లో బెయిల్ కాలపరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఆ సమాచారాన్ని తిహాడ్ అధికారులతో పంచుకోలేదని చెప్పారు. మరోవైపు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొంత మంది ఖైదీలు పారిపోయి ఉంటారని అన్నారు.

నేరాలు పెరుగుతాయా?

జైలుకు తిరిగిరాని ఖైదీలను వెంటనే పట్టుకోకపోతే.. దిల్లీలో నేరాలు పెరిపోయే ప్రమాదం ఉంది. తిరిగిరాని 3400 మంది ఖైదీల్లో చాలా వరకు తీవ్రమైన నేరాలు చేసినవారే ఉన్నారు. ఇప్పటికీ వారు సరెండర్ కాకపోవడాన్ని బట్టి.. నగరంలో నేరాలు చేసేందుకు కావాలనే తప్పించుకు తిరుగుతున్నారని అర్థమవుతోందని దిల్లీ పోలీసు మాజీ ఏసీపీ వేద్ భూషణ్ పేర్కొన్నారు.

"2020లో ఖైదీలను విడుదల చేయగానే.. దిల్లీలో దోపిడీలు, లూటీలు, స్నాచింగ్ కేసులు పెరిగాయి. వీరు తిరిగిరాకపోతే.. నేరాలు మళ్లీ పెరిగిపోతాయి. వారిని పట్టుకోవడం పోలీసులకు చాలా పెద్ద సవాల్. రాజధానిలో కరోనా తీవ్రత పెరిగిపోయింది. ఇటీవల కాలంలో 300 మందికి పైగా పోలీసులు వైరస్ బారినపడ్డారు. ఈ సమయంలో వేల సంఖ్యలో ఖైదీలను వెతికిపట్టుకోవడం కత్తిమీద సాము వంటిదే."

-వేద్ భూషణ్, మాజీ ఏసీపీ, దిల్లీ పోలీసు విభాగం

దోషులుగా తేలి, పెరోల్​పై విడుదలైన నేరస్థులు చాలా వరకు తిరిగొచ్చారని తిహాడ్ జైలు డీజీ సందీప్ గోయల్ తెలిపారు. చిన్న నేరాలకు సంబంధించి విచారణలో ఉన్న నిందితుల్లో కొందరు తిరిగిరాలేదని చెప్పారు. వారికి కోర్టులు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని వివరించారు.

తిహాడ్​ జైలులో ఖైదీల వివరాలు

  • అత్యవసర పెరోల్ మీద విడుదలైన దోషులు: 1185
  • వీరిలో తిరిగివచ్చిన వారు: 1073, తప్పించుకున్నవారు: 112
  • మధ్యంతర బెయిల్​ తీసుకున్న విచారణ ఖైదీలు: 5556
  • వీరిలో తిరిగివచ్చిన వారు: 2200, తప్పించుకున్నవారు: 3356
  • (పై గణాంకాలు ఏప్రిల్ 15 నాటికి)
  • మధ్యంతర బెయిల్ పొందిన తీవ్రమైన నేరాల్లోని నిందితులు: 2318
  • చిన్న నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ మధ్యంతర బెయిల్ పొందినవారు: 2907
  • హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిళ్లు: 356
  • (పై గణాంకాలు 2020 అక్టోబర్ 20 నాటికి)

ప్రస్తుతం పరారీలో ఉన్న ఖైదీలు ఏ నేరాలు చేస్తున్నారన్న విషయం పక్కనబెడితే.. ఈ విషయంలో అధికారులు ఏ నిబంధనలను పాటించారన్న విషయమే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దిల్లీలో నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడు వేల మంది నేరస్థుల ఆచూకీ తెలియకపోవడం.. నగరవాసులకు ఆందోళన కలిగించే విషయమే.

ఖైదీలపై తీసుకునే చర్యలు?

ముందుగా, ఆచూకీ తెలియని ఖైదీల గురించి తిహాడ్ జైలు అధికారులు.. దిల్లీ పోలీసులకు సమాచారం అందిస్తారు. ఖైదీలను పోలీసులు వెతికి పట్టుకుంటారు. వీరిని కోర్టుల్లో ప్రవేశపెట్టి.. మళ్లీ జైలుకు తరలిస్తారు. జైల్లోనూ వీరికి అదనపు శిక్షలు విధిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భవిష్యత్​లో దోషులు పెట్టుకునే పెరోల్ అభ్యర్థనను తిరస్కరిస్తారు.

ఇదీ చదవండి: కరోనా మరణాలను ప్రభుత్వాలు దాస్తున్నాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.