ETV Bharat / bharat

వర్షాల దెబ్బకు ఉత్తరాఖండ్‌ విలవిల..

author img

By

Published : Oct 20, 2021, 5:45 AM IST

ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వానల ధాటికి ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోయారు. నైనీతాల్‌లో ఒక్కరోజే 28 మంది మృత్యువాత పడ్డారు. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయాయి.

uttarakhand rains
ఉత్తరాఖండ్‌ వర్షాలు

దేవభూమి ఉత్తరాఖండ్‌ ప్రకృతి ప్రకోపంతో వణికిపోతోంది. మూడు రోజులుగా ఎడతెగని వర్షాలు రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల సంబంధిత ఘటనల్లో మృత్యువాతపడ్డవారి సంఖ్య 47కు పెరిగింది. సోమవారం ఐదుగురు మరణించగా, మంగళవారం ఒక్కరోజే మరో 42 మంది దుర్మరణం పాలయ్యారు. వరదలు ముంచెత్తుతుండటంతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. ప్రధానంగా కుమావ్‌ ప్రాంతం వరుణుడి దెబ్బకు కుదేలైంది. భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన మూడు హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ మంత్రి ధన్‌సింగ్‌ రావత్‌, డీజీపీ అశోక్‌ కుమార్‌లతో కలిసి ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా పంట నష్టాలను అంచనా వేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. తాజా విపత్తులో మరణించినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

uttarakhand rains
ఉత్తరాఖండ్‌ వర్షాలు

అంతర్జాల సేవలకూ అంతరాయం..

కుంభవృష్టి దెబ్బకు నైనీతాల్‌ అతలాకుతలమవుతోంది. ఈ జిల్లాలో అంతర్జాల సేవలకూ అంతరాయం ఏర్పడింది. నైనీ సరస్సు ఒడ్డున ఉన్న నైనా దేవి ఆలయం, మాల్‌ రోడ్డును వరదలు ముంచెత్తాయి. కోసీ నది ఉప్పొంగి ప్రవహించడంతో రామ్‌నగర్‌-రాణిఖేత్‌ మార్గంలోని లెమన్‌ ట్రీ రిసార్టులో దాదాపు 100 మంది చిక్కుకుపోగా అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చిన దాదాపు వంద మంది గుజరాత్‌ యాత్రికులు ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయారు. రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధాని మోదీ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీకి ఫోన్‌ చేసి ఆరా తీశారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామన్నారు.

uttarakhand rains
ఉత్తరాఖండ్‌ వర్షాలు

కేరళలో 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌..

కేరళలో రెండు రోజుల పాటు కాస్త శాంతించిన వరుణుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరువనంతపురం, పథనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్‌, పాలక్కడ్‌, మళప్పురం, కోజికోడ్‌, వయనాడ్‌, కన్నూర్‌ జిల్లాలకు బుధవారానికిగాను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 6-20 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశమున్న ప్రాంతాలకు ఈ హెచ్చరికను జారీ చేస్తుంటారు. మరోవైపు- రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా పెరగడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

యూపీలో నలుగురి మృతి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్షాల సంబంధిత ఘటనల్లో మంగళవారం నలుగురు మృత్యువాతపడ్డారు. బిహార్‌, బెంగాల్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, తమిళనాడుల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.