ETV Bharat / bharat

కరోనా వ్యాప్తిపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

author img

By

Published : Dec 22, 2022, 3:41 PM IST

Updated : Dec 22, 2022, 8:11 PM IST

PM VIRUS MEETING
PM VIRUS MEETING

కరోనా వ్యాప్తిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో భేటీ అయి చర్చించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా సీనియర్ అధిరులతో చర్చలు జరిపిన ఆయన.. దేశంలో కరోనా వ్యాప్తి, కొత్త వేరియంట్ కేసులపై అధికారులను మోదీ ఆరా తీశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు. ముఖ్యంగా రాబోయే పండగ సీజన్లను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

కరోనా ఇంకా ముగిసిపోలేదని.. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నొక్కి చెప్పారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను సంసిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే దేశంలో టెస్టింగ్‌, జీనోమ్‌ సిక్వెన్సింగ్‌ను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ లాబోరేటరీకి పెద్ద మెుత్తంలో నమూనాలను పంపాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. సంసిద్ధతలో భాగంగా ప్రతి రాష్ట్రం తమ వద్ద ఉన్న ఆక్సిజన్‌ సిలీండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలను ఆడిట్‌ చేసుకోవాలని ప్రధాని ఆదేశించారు.

కాగా, చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాతో పాటు కొవిడ్ అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ర్యాండమ్​గా కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కేంద్రం కోరుతోంది. త్వరలో వరుస పండుగలు రానున్న నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలని మాండవీయ సూచించారు. కరోనా పరిస్థితిపై పార్లమెంట్​లో మాట్లాడిన ఆయన.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. భారత్​లో మాత్రం తగ్గుతున్నాయని తెలిపారు. చైనాలో కొవిడ్​ కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలో మహమ్మారి కట్టడి చేయడంలో కేంద్ర చురుగ్గా వ్యవహరిస్తోందని అన్నారు.

కొత్త వేరియంట్ ప్రమాదం..
చైనాలో కొవిడ్ విజృంభణకు కారణమైన బీఎఫ్.7 రకం కరోనా వేరియంట్ భారత్​లోనూ వెలుగులోకి వచ్చింది. తొలి కేసును గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్.. అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా బీఎఫ్‌-7 వేరియంట్ కేసులు ఇప్పటివరకు 4 నమోదైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో 3 గుజరాత్‌లో నమోదుకాగా.. మరో కేసు ఒడిశాలో వెలుగుచూసినట్లు పేర్కొన్నాయి. కాగా, దేశంలో కొత్తగా 185 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి ఒకరు మరణించారు.

Last Updated :Dec 22, 2022, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.