ETV Bharat / bharat

3రోజులుగా కుళ్లిన మృతదేహాల మధ్య నవజాత శిశువు.. తల్లిపాలు లేకున్నా ఆరోగ్యంగానే..

author img

By

Published : Jun 14, 2023, 10:21 PM IST

Couple Found Died In Dehradun
దంపతుల మృతదేహాల మధ్య చిన్నారి

Couple Found Died In Dehradun: నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువు.. మూడు రోజుల పాటు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల్లిదండ్రుల మృతదేహాల మధ్య సజీవంగా ఉంది. మూడు రోజులుగా తల్లిపాలు లేకుండా శిశువు ఆరోగ్యంగా ఉండడం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

Couple Found Died In Dehradun: ఉత్తరాఖండ్​.. దెహ్రాదూన్ ఓ ఇంట్లో ఇద్దరు దంపతులు మూడు రోజులుగా విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కుళ్లిపోయిన మృతదేహాల మధ్య సజీవంగా ఉన్న చిన్నారిని చూసి షాక్​కు గురయ్యారు. వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. మరణించిన వారిని కాసిఫ్​, ఆనమ్​లుగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటన జూన్ 13వ తేదీన వెలుగుచూసింది.

ఇదీ జరిగింది.. నాగల్ జిల్లా సహరాన్​పుర్​కు చెందిన కాసిఫ్​కు ఆనమ్ రెండో భార్య. వీరిద్దరూ టర్నర్​ రోడ్డు C-13లోని సొహైల్​ అనే వ్యక్తి ఇంట్లో నాలుగు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో జూన్ 9న ఆనమ్.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అదే రోజు సాయంత్రం ఆనమ్​ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యింది. నాలుగు రోజుల వ్యవధిలో ఆనమ్​, ఆమె భర్త ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిది ఆత్మహత్య అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

కాసిఫ్ మొదటి భార్య నుస్రత్ తెలిపిన వివరాలు.. కాసిఫ్ తనతో జూన్ 10వ తేదీ రాత్రి చివరిసారిగా మాట్లాడాడని.. మరుసటి రోజు సహరాన్​పుర్​కు వస్తానని చెప్పాడని కాసిఫ్ మొదటి భార్య నుస్రత్ పోలీసులకు తెలిపింది. కాసిఫ్​కు చాలా అప్పులు ఉన్నాయని.. ఇటీవల ఓ వ్యక్తి దగ్గర జూన్ 11న రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడని చెప్పింది.

"జూన్ 11న సహరాన్​పుర్​కు వస్తానని చెప్పి రెండు రోజులు గడుస్తున్నా.. ఇంకా ఇంటికి రాకపోవడం వల్ల నేను పలుమార్లు కాసిఫ్​కు ఫోన్ చేశాను. ఫోన్ స్విచ్ఛాఫ్​ రావడం వల్ల నాకు మరింత భయం వేసింది. దీంతో అతడి కోసం వెతుకుతూ టర్నర్​ రోడ్డులోని అతడి ఇంటికి వెళ్లాను. అప్పుడు ఆ ఇళ్లు తాళం వేసి ఉంది. ఇంట్లో నుంచి పిల్లాడి ఏడుపు వినిపించి.. పోలీసులకు సమాచారం ఇచ్చాను. లోపలికి వెళ్లి చూస్తే.. కాసిఫ్, ఆనమ్​ విగతజీవులుగా పడి ఉన్నారు."

-- నుస్రత్, కాసిఫ్ మొదటి భార్య..

చిన్నారి ఆరోగ్య పరిస్థితి.. చిన్నారిని ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి స్పృహలోనే ఉన్నాడని డాక్టర్ ధనంజయ్ ధోవల్ తెలిపారు. అయితే శరీరంపై చాలా పురుగులున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. 'బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. తగినంత బరువు కూడా ఉన్నాడు. ఐసీయూలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కానీ మూడు రోజుల పాటు తల్లిపాలు కూడా లేకుండా పిల్లవాడు ఆరోగ్యంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది' అని చిన్నారికి వైద్యం అందిస్తున్న డాక్టర్ ధనుంజయ్ తెలిపారు.

"మృతుడు కాసిఫ్ తన మొదటి భార్యతో ఎప్పుడు గొడవ పడేవాడు. అతడికి చాలా అప్పులు ఉన్నాయి. ఈ కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మేము అనుమానిస్తున్నాము. కానీ పూర్తి దర్యాప్తు అనంతరమే మృతికి గల కారణాలు తెలుస్తాయి. కాగా కాసిఫ్ రెండో పెళ్లి చేసుకున్నట్లు నుస్రత్​కు తెలియదు. కాసిఫ్​కు మొదటి భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. నుస్రత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలనున్నాయి"

--పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.