ETV Bharat / bharat

నైటీలు, లుంగీలు బ్యాన్.. హౌసింగ్ సొసైటీ వింత నిర్ణయం..!

author img

By

Published : Jun 14, 2023, 4:30 PM IST

ఆడవారు నైటీలు, మగవారు లుంగీలు ధరించి తిరగకుండా నిషేధం విధించింది ఉత్తర్​ప్రదేశ్​ గ్రేటర్​ నొయిడా ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్​మెంట్​ సొసైటీ.

A Society In Greater Noida Imposes Dress Code
వాళ్లు నైటీలు, వీళ్లు లుంగీలు వేసుకోవద్దు.. సొసైటీ వింత నిర్ణయం..!

Greater Noida Society lungi nighty ban : ఉత్తర్​ప్రదేశ్​ గ్రేటర్​ నొయిడా ప్రాంతంలోని ఓ అపార్ట్​మెంట్​ సొసైటీ సభ్యులు ఓ వింత నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి అపార్ట్​మెంట్​ పరిసర ప్రాంతాల్లో ఆడవారు నైటీలు, మగవారు లుంగీలు ధరించి తిరగకుండా నిషేధం విధించారు. అంతే కాకుండా అక్కడ తిరిగేందుకు ఓ ప్రత్యేకమైన డ్రెస్​ కోడ్​ను కూడా రూపొందించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.

"మహిళలు నైటీలు ధరించి బయట తిరుగుతుంటే పురుషులకు అసౌకర్యంగా ఉంటుంది. అదే విధంగా మగవారు లుంగీలు వేసుకొని బయటకు వస్తే మహిళలూ అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి మేము ఇద్దరిని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము." అని హింసాగర్​ సొసైటీ రెసిడెంట్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్ ​(ఆర్‌డబ్ల్యూఏ) అధ్యక్షుడు సీకే కల్రా తెలిపారు. ఇది సమాజహితం కోసం తీసుకున్న ఓ మంచి నిర్ణయమని.. దీనిని అందరూ గౌరవించాలని ఆయన కోరారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదని కల్రా చెప్పారు.
"అపార్ట్​మెంట్‌ పరిసర ప్రాంతాల్లో తిరిగే సమయంలో మీ దుస్తులు, ప్రవర్తనపై ప్రత్యేక శద్ధ పెడతారని ఆశిస్తున్నాం. తద్వారా మీ ప్రవర్తనను ఎవ్వరూ తప్పుపట్టే అవకాశం ఉండదు." అని సొసైటీ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం..
తాము ఎవరిపైనా వివక్ష చూపడం లేదని.. అపార్ట్​మెంట్‌ పరిసరాల్లో వదులుగా ఉండే దుస్తులు ధరించి కొందరు వ్యక్తులు నిత్యం యోగా చేస్తున్నారని.. వాటిపై ఫిర్యాదులు వచ్చినందునే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని సొసైటీ అధ్యక్షుడు చెప్పారు. తొలుత వారికి మౌఖికంగా చెప్పినప్పటికీ.. వారిలో మార్పు రాకపోవడం వల్లే ఇలా సర్క్యులర్‌ జారీచేశామని ఆయన చెప్పారు.

  • UP: A society in Greater Noida imposes dress code, and bans nighties and lungies in the society premises

    This is a good decision taken by society and everyone must respect it, there is nothing to oppose. If women wear nighties and roam around, that will be uncomfortable for men… pic.twitter.com/0OTtGfgM7d

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ నిబంధనకు సంబంధించిన నోటీసులను జూన్​ 10న సొసైటీలో నివసిస్తున్న వారికి జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో, పార్కింగ్​ స్థలాల్లో లుంగీలు లేదా నైటీలు ధరించి తిరగరాదని దాంట్లో పేర్కొన్నారు. అయితే నైటీలు, లుంగీలు అనేవి కేవలం ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుని తిరిగే దుస్తులు మాత్రమేనని సొసైటీ ఇచ్చిన నోటీసులో పేర్కొంది. ఈ నోటీస్ కాస్తా సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టడం వల్ల ఇతర హౌసింగ్​ సొసైటీ సభ్యులు, రెసిడెంట్లు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అయితే సొసైటీలో నివసించే వారు మాత్రం ఈ నిర్ణయంతో తమకెలాంటి ఇబ్బంది లేదని చెప్తుండటం గమనార్హం.

మిశ్రమ స్పందన..
ఈ నిర్ణయంపై సోషల్​ మీడియాలో నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు సొసైటీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరేమో తీవ్రంగా తప్పబడుతున్నారు. 'ఇతరుల వస్త్రధారణపై నిబంధనలు విధించే అధికారం ఎవరికీ లేదు. ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు దుస్తులు వేసుకుంటారు. ఇలా బ్యాన్​ విధించి తాము చెప్పిన బట్టలనే మాత్రమే ధరించాలనే నిర్ణయం సరైంది కాదు' అని ఓ నెటిజన్​ అభిప్రాయపడ్డాడు.' 'లుంగీ అనేది దక్షిణ భారత దేశ సంస్కృతిలో ఓ సంప్రదాయ వస్త్రధారణ అని.. దయచేసి ఇలా చేయకండి' అంటూ మరో నెటిజన్​ చెప్పుకొచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.