ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరమే: సుప్రీంకోర్టు

author img

By

Published : Sep 9, 2022, 7:51 AM IST

Updated : Sep 9, 2022, 8:31 AM IST

supreme court
సుప్రీంకోర్టు ()

ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని.. సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు, ఈడబ్ల్యూఎస్‌కు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం కోటా కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల నుంచి.. ఉద్భవించిన మూడు విస్తృత అంశాలపై తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు గురువారం నిర్ణయించింది.

ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్‌ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదిరిందన్న కారణంతో మద్రాసు హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది. హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి.. నిందితులపై క్రిమినల్‌ ఫిర్యాదును మళ్లీ తెరవాలని ఆదేశించింది. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలను కొనేవారు తిరిగి ఆ మొత్తం సంపాదించడానికి అవినీతికి పాల్పడతారని.. దీంతో పరోక్షంగా ప్రజలు బాధితులు అవుతారని.. అందువల్ల ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించకూడదని ధర్మాసనం పేర్కొంది.

ఈడబ్ల్యూఎస్‌పై..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు విద్యాసంస్థల్లోనూ, ఉద్యోగాల్లోనూ 10 శాతం కోటా(రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల నుంచి ఉద్భవించిన మూడు విస్తృత అంశాలపై తీర్పు వెలువరించాలని సుప్రీం కోర్టు గురువారం నిర్ణయించింది. కేంద్రం ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికి అనుమతించే రాజ్యాంగ చట్టం(103 సవరణ) రాజ్యాంగం మౌలికస్వరూపాన్ని అతిక్రమిస్తోందా అన్న విషయాన్నీ తేల్చనుంది. రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి గల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో విషయాలన్నింటిని స్పృశిస్తూ విస్తృత నిర్ణయం తీసుకునేందుకు అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ మూడు అంశాలను సూచించారని అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ తెలిపారు. ఈ పిటిషన్లపై విచారణను ఈ నెల 13 నుంచి ప్రారంభిస్తామని ఇంతకు ముందే సుప్రీంకోర్టు ప్రకటించింది.

హిజాబ్​తో పోల్చొద్దు..
సిక్కులు వారి సంస్కృతిలో భాగంగా ధరించే తలపాగా, కిర్పాన్‌, ఖడ్గం వంటి వాటితో హిజాబ్‌ను పోల్చడం సముచితం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కర్ణాటక ప్రభుత్వం విద్యా సంస్థల్లో హిజాబ్‌ ధారణపై విధించిన నిషేధం, దానిని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ముందు గురువారం వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సిక్కుల ఆచారాల విషయాన్ని ఓ న్యాయవాది ప్రస్తావించారు. హిజాబ్‌తో సిక్కుల సంప్రదాయాలను పోల్చడం సరికాదని ధర్మాసనం సూచించింది. భారతీయ సమాజంలో సిక్కుల ఆచారాలు మమేకమై పోయాయని, రాజ్యాంగ అధికరణం 25లోనూ కడియం(కిర్పాన్‌) ప్రస్తావన ఉందని తెలిపింది. శాంతిభద్రతలకు అంతరాయం కలిగించే అంశాలపై వాదోపవాదనలు జరిగాయి. హిజాబ్‌ ధారణ ముస్లింల ఆచారంలో భాగమేనని ఓ న్యాయవాది పేర్కొనగా.. విద్యా సంస్థల నిబంధనల్ని పాటించాల్సిన ఆవశ్యకతను ధర్మాసనం గుర్తు చేసింది. తదుపరి వాదనలు ఈ నెల 12న కొనసాగనున్నాయి.

ఇవీ చదవండి: విజయవంతంగా క్యూఆర్‌శామ్‌ పరీక్ష.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన రాజ్​నాథ్​

భారత్​-చైనా సైన్యాల సంయుక్త ప్రకటన.. అక్కడి నుంచి బలగాల ఉపసంహరణ..

Last Updated :Sep 9, 2022, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.