ETV Bharat / bharat

Congress On INDIA Alliance : 'ఇండియా' కూటమిపై అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్​.. తెరవెనుక అన్ని జరుగుతున్నాయట!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 3:02 PM IST

Congress  On INDIA Alliance
Congress On INDIA Alliance

Congress On INDIA Alliance : ఇండియా కూటమి నెమ్మగించిందని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ స్పందించింది. కూటమిలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారం కోసం చర్చిస్తున్నట్లు తెలిపింది. ఉమ్మడి సమావేశాలు నిర్వహించకున్నా.. తెరవెనుక సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేసింది.

Congress On INDIA Alliance : విపక్ష ఇండియా కూటమి తలపెట్టిన భోపాల్​ ర్యాలీ రద్దయింది. అంతేగాక కూటమి కూడా సంయుక్త సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సీట్ల పంపకంలో పార్టీల మధ్య సయోధ్య కుదరలేదా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ స్పందించింది. తమ పార్టీ అగ్రనాయకత్వం అంతా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ప్రచారంలో బిజీగా ఉందని.. అందుకే అలాంటి ఉమ్మడి కార్యక్రమాలు సాధ్యం కావడం లేదని కాంగ్రెస్​ చెప్పింది. దీనికి తోడు రాష్ట్ర యూనిట్లు కూడా ప్రచారంలో బిజీ అయిపోయాయని తెలిపింది. ఇండియా కూటమిలో కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమని.. వాటిని పరిష్కరించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని ఏఐసీసీ కోఆర్డినేటర్​ సయ్యద్​ నజీర్​ హుస్సేన్​ 'ఈటీవీ భారత్'​కు చెప్పారు.

"మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్రా వంటి అగ్రనాయకత్వం.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల నాయకత్వం కూడా ఎన్నికల పనుల్లో విశ్రాంతి లేకుండా ఉంది. ఈ కారణంగా ఇండియా కూటమి నెమ్మదించిందని అనుకోలేం. సీనియర్​ నాయకులు లేనంత మాత్రాన సమాంతర సమావేశాలు నిర్వహించలేమని కాదు. సీట్ల పంపకం గురించి, సోషల్​ మీడియా వ్యూహాలు, ఉమ్మడి ప్రచారాలు వంటి అంశాలపై తెరవెనుక సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇండియా కూటమి ఒక పార్టీతో కేంద్రీకృతం కానందున.. ఇలాంటి సంప్రదింపులు ఎక్కువగా రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. గత నెలలో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా.. గత వారంలో దిల్లీలో అనేక సంప్రదింపులు జరిగాయి"
--సయ్యద్​ నజీర్ హుస్సేన్, ఏఐసీసీ కోఆర్డినేటర్​

దాని అర్థం అది కాదు!
'ఇండియా కూటమి నాయకులు ఒక నిర్దిష్ట నగరంలో లేరు. దీని వల్ల వారు మీడియాతో కలిసి మాట్లాడలేకపోతున్నారు. అంత మాత్రాన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని కాదు. ఫోన్​, కాన్ఫరెన్స్​ కాల్స్, జూమ్​ సమావేశాల ద్వారా చాలా సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రతి సమాచారం మీడియాకు తెలియాలని లేదు. చర్చలు పూర్తైన తర్వాత మేము కచ్చితంగా అధికారిక ప్రకటన చేస్తాం.' అని ఏఐసీసీ సోషల్​ మీడియా ఇన్​ఛార్జ్​ సుప్రియా శ్రినేట్​ 'ఈటీవీ భారత్​'కు వివరించారు.

ఉమ్మడి సమావేశంపై కసరత్తు
INDIA Alliance Joint Meeting : కాంగ్రెస్​ పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం.. ఇండియా కూటమికి చెందిన సోషల్​ మీడియా, ఉమ్మడి ప్రచార సబ్​ కమిటీలు వ్యక్తిగతంగా ముంబయి, దిల్లీలలో సమావేశమయ్యాయి. అలాంటి మరికొన్ని సంప్రదింపులు ఆన్​లైన్​లో జరిగాయి. అయితే, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో విపక్షాల ఉమ్మడి సమావేశం చేయనప్పటికీ.. ఆలాంటి సభను అనుకూలమైన చోట నిర్వహించేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.

వనరులు చాలడం లేదు!.. సీట్ల పంపకంలో సమస్య
INDIA Alliance Seat Sharing Formula : 'బహిరంగ సభ ప్లాన్​ చేస్తే లక్ష నుంచి రెండు లక్షల మందిని సమీకరించాలి. అలాంటి సమయంలో మన వద్ద ఉన్న వనరుల అంశం ప్రస్తావనకు వస్తుంది. వనరులు లేనప్పుడు ఉమ్మడి ర్యాలీని ఎవరు నిర్వహిస్తారు. దీంతో పాటు సీనియర్​ నేతలు కూడా అందుబాటులో ఉండేటట్టు కసరత్తు చేయాలి. అయితే ఈ నెలలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం' అని ఏఐసీసీ సీనియర్​ నేత ఒకరు తెలిపారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు ఆయన చెప్పారు. వాటిని పరిష్కరించి ఏకాభిప్రాయాన్ని సాధించాలని.. ఇంకా ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించుకోవాలని కూటమి ప్రయత్నిస్తోందని చెప్పారు.

అయితే ఈ సీట్ల పంపకంపై ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. బిహార్​లో ఉన్న 40 లోక్​సభ్​ స్థానాల్లో సీట్ల పంపకాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​లు పర్యవేక్షిస్తున్నారు. ఇక 80 సీట్లు ఉన్న ఉత్తర్​ప్రదేశ్​లో ఆ బాధ్యత సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ తీసుకున్నారు. 48 సీట్లు ఉన్న మహారాష్ట్రలో సామరస్యంగా సీట్ల పంపిణీకి ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్​ ఠాక్రే కృషి చేస్తున్నారు. ఈ పనిని సమన్వయ కమిటీ పర్యవేక్షిస్తుండటం వల్ల కూటమికి ఛైర్​పర్సన్, కన్వీనర్​ను నియమించడం ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇక ఈ కూటమికి ప్రధాన కార్యాలయం కూడా ఇంకా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఏసీసీఐ కార్యాలయం కూటమికి సహాయం అందిస్తోంది.

వీలైనంత వరకు ఉమ్మడి పోరు.. సెప్టెంబర్​ 30లోగా సీట్ల సర్దుబాటు.. 14 మందితో సమన్వయ కమిటీ

'ఇండియా' కూటమి భోపాల్​ ర్యాలీ రద్దు.. కారణం అదేనని బీజేపీ సెటైర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.