ETV Bharat / bharat

మహిళా​ ఎమ్మెల్సీపై దాడి.. ప్రజలతో మాట్లాడుతుండగా చెంపదెబ్బ

author img

By

Published : Feb 9, 2023, 1:25 PM IST

Updated : Feb 9, 2023, 3:26 PM IST

కాంగ్రెస్ మహిళా​ ఎమ్మెల్సీపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీని పక్కకు లాగి.. అనంతరం చెంపపై బలంగా కొట్టాడు. ఘటనకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Congress MLC Pradnya Satav slapped in Maharashtra
కాంగ్రెస్​ ఎమ్మెల్సీ ప్రద్​న్యా సతవ్​పై దాడి

మహారాష్ట్రలో మహిళా ఎమ్మెల్సీపై దాడి జరిగింది. కాంగ్రెస్​ పార్టీకి చెందిన ప్రజ్ఞా సాతవ్​పై చేయి చేసుకున్నాడు ఓ వ్యక్తి. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. హింగోలి జిల్లా పర్యటనలో ప్రజలతో ప్రజ్ఞా సాతవ్ మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన ఓ 40 ఏళ్ల వ్యక్తి.. ఆమెను లాగి అనంతరం చెంపపై బలంగా కొట్టాడు. దీంతో ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ. అతడిపై చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు దివంగత కాంగ్రెస్ నేత రాజీవ్ సాతవ్ భార్య.

ఎవరైనా చేయించారా?
గత కొన్ని రోజులుగా ప్రజ్ఞా సాతవ్​ జిల్లాలో విసృతంగా పర్యటిస్తున్నారు. హింగోలిలోని పలు ప్రాంతాల ప్రజలతో మమేకం అవుతున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే బుధవారం రాత్రి 8.30 గంటలకు కలమ్నూరి గ్రామానికి ఎమ్మెల్సీ వెళ్లారు. అక్కడికి కొంత మంది ప్రజలు వచ్చి ఆమె కారును ఆపి మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డాడు.

"నిందితుడిని మహేంద్రగా గుర్తించాం. బుధవారం రాత్రే అతడిని అరెస్ట్​ చేశాం. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. నిందితుడే ఈ దాడికి ప్రధాన కారణమా లేక ఎవరైనా చేయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం" అని పోలీసులు తెలిపారు. "ఈ రోజు నాపై దారుణంగా దాడి జరిగింది. కస్​బే ధావాండాలోని కలమ్నూరి గ్రామంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఇది నన్ను గాయపరచడానికి చేసిన ప్రయత్నం. నా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది" అని ఎమ్మెల్సీ ప్రజ్ఞా సాతవ్​​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు.

ఎన్ని సార్లు తనపై దాడి జరిగినా భయపడనన్నారు ఎమ్మెల్సీ ప్రజ్ఞా సాతవ్​. ఇలాంటి ఘటనలకు తాను అస్సలు బెదరనని స్పష్టం చేశారు. ఓ మహిళా ఎమ్మెల్సీపై దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంపైనే దాడి చేయడమని అన్నారు. ఇవేవీ తనపై ప్రభావం చూపవని, 24 గంటలు ప్రజల కోసమే పాటు పడతానని స్పష్టం చేశారు. తన జీవితం ప్రమాదంలో పడినా తాను మాత్రం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని తేల్చిచెప్పారు.

తనపై భారత్​ జోడో యాత్రలోనూ దాడి జరిగిందన్నారు ప్రజ్ఞా సాతవ్​​. అప్పుడు అక్కడున్న ప్రజలు ఆమెను రక్షించారన్నారు. మహిళలపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా జరిగిన దాడిపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఎవరో కావాలనే అతడిని పంపించారన్నారు. అంతకుముందు రోజు రాత్రి ఓ దుండగుడు తన కారును అనసరించి, లోపల ఎవరున్నారని ఆరా తీశాడని ఎమ్మెల్సీ వెల్లడించారు.

Last Updated :Feb 9, 2023, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.