ETV Bharat / bharat

'చైనా విషయంలో మౌనం ఎందుకు?'.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఫైర్​

author img

By

Published : Dec 3, 2022, 9:36 PM IST

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. చైనా ఆక్రమణలపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. మరోవైపు, వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల, రాజ్యాంగ, స్వతంత్ర సంస్థల కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం వంటి అంశాలను పార్లమెంట్​లో లేవనెత్తనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు.

Congress attacks Modi
ప్రధాని మోదీపై కాంగ్రెస్ విమర్శలు

తూర్పు లద్దాఖ్‌లోని దెప్సాంగ్‌, దెమ్‌చొక్‌ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలనీ, దెప్సాంగ్‌లో చైనా పెద్దఎత్తున ఆక్రమణలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా ఆక్రమణలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. ఎల్​ఏసీ వెంట 2020కి ముందున్న పరిస్థితులను పునరుద్ధరించేందుకు ఏం చేశారని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే నిలదీశారు.

జీ-20 సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ కరచాలనం చేయటాన్ని సుప్రియా శ్రీనతే తప్పుపట్టారు. చైనా సైనికులు శాశ్వతంగా ఉండేందుకు దెప్సాంగ్‌ ప్రాంతంలో వాతావరణాన్ని క్రమబద్ధీకరించే శిబిరాలను నిర్మించిందన్న వార్త కథనాలను ఆమె ప్రస్తావించారు. వాస్తవాధీనరేఖకు 15 నుంచి 18కిలోమీటర్ల లోపల అలాంటి 200 శిబిరాలను డ్రాగన్‌ నిర్మించినట్లు చెప్పారు. ఈ మేరకు ఉపగ్రహ చిత్రాలను కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రదర్శించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నా.. అలాంటిదేం లేదని ప్రధాని మోదీ బుకాయిస్తున్నారనీ సుప్రియా శ్రీనతే ధ్వజమెత్తారు.

వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో..
వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ తెలిపారు. భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు, అధిక ధరలు, రాజ్యాంగ, స్వతంత్ర సంస్థల కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం అంశాలను పార్లమెంటులో చర్చకు లేవనెత్తనున్నట్లు చెప్పారు.

ఈనెల ఏడు నుంచి మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సోనియా అధ్యక్షతన సమావేశం జరిగింది. కులాలవారీ జనగణనకు కాంగ్రెస్‌ అనుకూలమన్న జైరాం రమేశ్​.. అది తప్పకుండా జరగాలన్నారు. ఈడబ్ల్యూఎస్​ కోటాకు సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు అంగీకరించటం, ఇద్దరు వ్యతిరేకించిన తర్వాత చర్చ మొదలైందని అన్నారు. అందువల్ల ఈ అంశాన్ని పున:పరిశీలించటం సహా పార్లమెంటులో చర్చ జరగాలని కాంగ్రెస్‌ కోరుకుంటున్నట్లు జైరాం రమేష్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.