ETV Bharat / bharat

CM KCR on Elections: 'వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుంది..'

author img

By

Published : Apr 14, 2023, 6:12 PM IST

Updated : Apr 14, 2023, 7:07 PM IST

CM KCR Speech at Ambedkar statue Unveiling Meeting: దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు చివరి రక్తబొట్టు వరకు కృషిచేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ తరువాత దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుందని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతోందన్న కేసీఆర్​... అందుకోసం రూ.51 కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

CM KCR
CM KCR

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుంది

CM KCR Speech at Ambedkar statue Unveiling Meeting : దేశానికే దిక్సూచిలా, సమానత్వ స్ఫూర్తిని నిత్యం రగిలించేలా... హైదరాబాద్‌ సాగర తీరానా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌... అతిపెద్ద విగ్రహం కొలువుదీరింది. రాజ్యాంగ నిర్మాత జయంతి వేళ 125 అడుగుల బాబా సాహెబ్‌ కాంస్య ప్రతిమను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుందన్నారు.

అంబేడ్కర్‌ విశ్వ మానవుడు : సభా వేదికపై జైభీమ్‌ అంటూ ప్రసంగం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అంబేడ్కర్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిందన్నారు. ఏటా అంబేడ్కర్‌ జయంతి జరుపుకుంటున్నామన్న సీఎం.. అంబేడ్కర్‌ విశ్వ మానవుడు అని కొనియాడారు. అంబేడ్కర్ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనమన్న కేసీఆర్​.. ఆయన కలలు సాకారం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎవరో అడిగితే అంబేడ్కర్‌ విగ్రహం పెట్టలేదన్నారు. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నామని తెలిపారు.

'సచివాలయానికి కూడా అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నాం. ఇక్కడికి దగ్గరలోనే అమరవీరుల స్మారకం ఉంది. అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం ఉంది. అంబేడ్కర్‌ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేశాం. ఇది విగ్రహం కాదు.. విప్లవం. తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం. విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు.'-సీఎం కేసీఆర్

అంబేడ్కర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ అవార్డు : అంబేడ్కర్‌ పేరిట అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అంబేడ్కర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతోందని తెలిపారు. అవార్డు కోసం రూ.51 కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏటా అంబేడ్కర్‌ జయంతి రోజున అవార్డు ప్రదానం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎస్సీల అభ్యున్నతి కోసం తెచ్చిన కార్యక్రమం దళితబంధు అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 50 వేల మందికి దళితబంధు అందిందన్న ముఖ్యమంత్రి... ఈ ఏడాది మరో 1.25 లక్షల మందికి దళితబంధు అమలు చేస్తామన్నారు. వాస్తవ కార్యాచరణ దిశగా ఎస్సీ మేధావులు కదలాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

'వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుంది. ఈ మాటలు కొందరికి మింగుడు పడకపోవచ్చు. మహారాష్ట్రలో బీఆర్​ఎస్​కు గొప్ప స్పందన వస్తోంది. మహారాష్ట్ర తరహాలోనే దేశమంతా స్పందించే రోజు వస్తుంది. దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుంది. అంబేడ్కర్‌ కలలు సాకారం కావాల్సిన అవసరం ఇంకా ఉంది. దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు చివరి రక్తబొట్టు వరకు కృషిచేస్తా.'-ముఖ్యమంత్రి కేసీఆర్

ఇవీ చదవండి:

Last Updated : Apr 14, 2023, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.