ETV Bharat / bharat

భోపాల్​లో గ్యాస్ లీక్.. ఏడుగురికి అస్వస్థత.. ఇళ్ల నుంచి జనం పరుగులు!

author img

By

Published : Oct 27, 2022, 2:03 PM IST

chlorine-gas-leak-in-bhopal-
chlorine-gas-leak-in-bhopal-

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్​లో గ్యాస్ లీకై.. ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఓ వాటర్ ఫిల్టర్ ప్లాంటులోని సిలిండర్ నుంచి క్లోరిన్ లీక్ అయిందని అధికారులు తెలిపారు.

గ్యాస్ లీకేజీ ఘటనతో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ఉలిక్కిపడింది. ఓ వాటర్ ఫిల్టర్ ప్లాంటులోని సిలిండర్ నుంచి క్లోరిన్ లీక్ అయి.. ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. 1984 నాటి దుర్ఘటన నేపథ్యంలో తాజా ఉదంతం జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు.. ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.

"షాజహనాబాద్​లోని ఈద్గా హిల్స్ ప్రాంతంలో ఉన్న భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ప్లాంట్​లో బుధవారం 900 కేజీల క్లోరిన్ సిలిండర్ లీకైంది. ప్లాంట్ పరిసరాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించాం. బాధితులకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. బాధితులు వాంతులు చేసుకున్నట్లు కొందరు స్థానికులు చెప్పారు. గ్యాస్ లీకేజీ గురించి తెలియగానే.. ప్లాట్​లో ఉన్న సిబ్బంది సిలిండర్​ను నీటిలో పడేశారు. లీకేజీని అడ్డుకొని, సిలిండర్​కు మరమ్మతులు చేశారు."
-ఉమేశ్ మిశ్ర, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్

chlorine-gas-leak-in-bhopal
బాధితులతో మాట్లాడుతున్న మంత్రి

రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విశ్వాస్ కైలాశ్.. బాధితులను పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి వారితో మాట్లాడారు. మరోవైపు, నీటిలో క్లోరిన్ పరిమాణం పెరిగినట్లు గుర్తించామని మున్సిపల్ కమిషనర్ కేవీఎస్ చౌదరి కొల్సాని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. కార్పొరేషన్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారని తెలిపారు.

దేశం మరువని విషాదం..
భోపాల్​లో 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి తర్వాత జరిగిన దుర్ఘటనలో.. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. యూనియన్ కార్బైడ్ ఇండియా అనే పురుగుల మందుల తయారీ ప్లాంట్​ నుంచి విషవాయువులు వెలువడటం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. 5లక్షల మందికి పైగా స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా ఇది మిగిలిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.