ETV Bharat / bharat

సంతానం కోసం ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు!

author img

By

Published : Oct 24, 2021, 10:15 PM IST

childless couple kills women
సంతానం కోసం మహిళలను బలిచ్చిన దంపతులు!

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగని ఓ దంపతులు.. దారుణానికి ఒడిగట్టారు. ఓ భూతవైద్యుడిని ఆశ్రయించి.. ఇద్దరు మహిళల ప్రాణం తీశారు. మధ్యప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం పరుగులు పెడుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మూఢ నమ్మకాలు వీడట్లేదు. మంత్రాల నెపంతో అమాయకుల ప్రాణాలను బలి తీస్తున్నారు. తాజాగా ఈ తరహా ఘటనే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో(Madhya Pradesh Gwalior News) వెలుగుచూసింది. పిల్లలు కలగాలని సంతానంలేని ఓ జంట భూతవైద్యుడిని ఆశ్రయించిన ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బలిస్తే సంతానం కలుగుతుందని...

గ్వాలియర్‌కు చెందిన బంటు బదౌరియా, మమత దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వారికి ఇప్పటివరకు సంతానం కలగలేదు. దీంతో మిత్రుడు నీరజ్‌ పర్మార్‌ ఆ దంపతులను భూతవైద్యుడిగా చెప్పుకుంటున్న గిర్వార్‌ యాదవ్‌ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఓ వ్యక్తిని బలిస్తే సంతానం కలుగుతుందని ఆ మాంత్రికుడు దంపతులకు సెలవిచ్చాడు. దీంతో బలిచ్చేందుకు వ్యక్తి కోసం వేట ప్రారంభించిన వారి మిత్రుడు నీరజ్‌ పర్మార్‌.. ఈనెల 13న ఓ సెక్స్‌ వర్కర్‌ను తీసుకువచ్చాడు. అక్కడే ఆమెను హత్య చేసి ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే కొద్దిదూరం వెళ్లగా.. బైక్‌ జారి కిందపడిపోయింది. దీంతో భయాందోళన చెందిన నీరజ్‌ మృతదేహాన్ని రోడ్డు పక్కన తుప్పల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

వెనక్కి తగ్గలేదు..

ఇంత జరిగినప్పటికీ బలి విషయంలో వారు వెనక్కి తగ్గలేదు. వారంరోజుల వ్యవధిలో అక్టోబర్‌ 20న మరో సెక్స్‌ వర్కర్‌ను ట్రాప్‌చేసి ఆమెను హత్యచేశారు. ఆమెకు మత్తుమందు ఇచ్చి భూతవైద్యుని ఎదుట బలిచ్చారు. మొదట హత్యకు గురైన మహిళ మృతదేహం ఈనెల 21న లభించగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు నీరజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ విషయాలను వెల్లడించాడు. దీంతో భూతవైద్యుడు సహా ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: Honey trap: కిలాడీ కపుల్​.. హనీట్రాప్​తో 300 మందికి టోకరా!

ఇదీ చూడండి: ఇంట్లోకి దూరి వివాహితపై అత్యాచారం- ఇద్దరు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.