ETV Bharat / bharat

'ఠాణాల్లో మానవహక్కుల ఉల్లంఘన విచారకరం'

author img

By

Published : Aug 8, 2021, 4:51 PM IST

Updated : Aug 8, 2021, 5:58 PM IST

CJI
జస్టిస్ ఎన్వీ రమణ

జైళ్లలో ఇప్పటికీ హింస కొనసాగుతుండటం ఆందోళనకరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పోలీసులు సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ న్యాయ సేవ కేంద్రం(నల్సా) మొబైల్ యాప్ ప్రారంభించిన కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

పోలీసు కస్టడీలోని నిందితులు ఇప్పటికీ శారీరక హింసకు గురికావడం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ ఉన్న వ్యక్తులపై కూడా పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినట్లు న్యాయస్థానాల దృష్టికి వచ్చిందన్నారు. పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా పోలీసులకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ న్యాయసేవా కేంద్రం-నల్సా యాప్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. యాప్ ద్వారా ప్రజలకు న్యాయసేవ మరింత చేరువ కానుందని పేర్కొన్నారు.

అందరికీ చేరువలో న్యాయవ్యవస్థ..

చట్ట ప్రకారం నడుచుకునే సమాజంలో విశేషమైన రక్షణ ఉన్న వ్యక్తులకు న్యాయపరిజ్ఞానం లేని వ్యక్తులకు న్యాయం అందే విధానంలో ఉన్న తేడాను తొలగించడం అత్యావశ్యకమని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ పౌరుల విశ్వాసాన్ని చూరగొనడం అత్యవసరం అన్నారు. న్యాయ వ్యవస్థ వారికోసమే ఉందన్న విశ్వాసం కల్పించాలని చెప్పారు. న్యాయపరిజ్ఞానం లేని ఎంతో మంది ఏళ్లుగా న్యాయవ్యవస్థకు వెలుపలే ఉండిపోతున్నారని జస్టిస్ రమణ అన్నారు. గతం భవిష్యత్‌ను నిర్దేశించజాలదన్న ఆయన.. అందరూ కలిసి సమానత్వ సాధనకు కృషి చేయాలని న్యాయవ్యవస్థలో భాగస్వాములైన వారికి పిలుపునిచ్చారు. నల్సా యాప్ పేదలకు, న్యాయ సహాయం అవసరమైన వారికి పరిహారం కోసం బాధితులు చేసే పోరాటంలో అండగా ఉంటుందని జస్టిస్ రమణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కస్టోడియల్ హింసపై జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో ఇప్పటికీ పోలీసుల దాష్టీకాలు కొనసాగుతుండడం ఆందోళనకరం. రాజ్యాంగపరంగా విశేషమైన రక్షణ ఉన్న వ్యక్తులపై కూడా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. మానవహక్కుల ఉల్లంఘన సహా.. శారీరక హింస పోలీస్ స్టేషన్లలోనే ఎక్కువగా ఉంటోంది. న్యాయవ్యవస్థ ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమను తాము న్యాయపరంగా రక్షించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి.

-జస్టిస్ ఎన్‌.వి. రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి

పోలీస్ స్టేషన్లలో కొనసాగుతున్న హింసపై దేశవ్యాప్తంగా పోలీసులకు అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు. పోలీసు ఠాణాల్లో ప్రత్యేకమైన బోర్డులు ఏర్పాటు చేసి.. అవగాహన కల్పించడం ద్వారా పోలీసుల మితిమీరిన చర్యలకు అడ్డకట్ట వేయొచ్చన్నారు. భారతదేశంలో ఉన్న సామాజిక-ఆర్థికపరమైన వైవిధ్యాలు న్యాయసహాయం విషయంలో అడ్డుగా నిలువ కూడదని జస్టిస్ రమణ పేర్కొన్నారు.

మానవ హక్కుల హననం సహా శారీరకపరమైన హింస ఎక్కువగా పోలీసు ఠాణాల్లో కనిపిస్తోంది. మన సమాజంలో ఇప్పటికీ కస్టోడియల్ హింసతో పాటు పోలీసుల దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి.రాజ్యాంగపరమైన ఒడంబడికలు, హామీలు ఉన్నప్పటికీ పోలీసు ఠాణాల్లో క్రియాశీలకమైన న్యాయసహాయం లేకపోవడం అన్నది.. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారితో పాటు.. అరెస్టైన వారికి రక్షణపరమైన నష్టాన్ని మిగిల్చేదే. ఇటీవల వస్తున్న నివేదికలను పరిశీలిస్తే రక్షణ ఉన్న వారు కూడా పోలీసు ఠాణాల్లో థర్డ్‌ డిగ్రీని ఎదుర్కోవాల్సి వస్తోందని తెలుస్తోంది.

-జస్టిస్ ఎన్‌.వి. రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి

మెరుగైన అంతర్జాల సేవలతో..

క్విట్ ఇండియా ఉద్యమానికి మహాత్మగాంధీ పిలుపునిచ్చి నేటితో 79 ఏళ్లు పూర్తైన వేళ.. స్వతంత్ర సంగ్రామంలో అసువులు భాసిన సమరయోధులకు సీజేఐ నివాళులు అర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాలం లేక న్యాయసహాయానికి అవరోధాలు ఏర్పడుతున్నాయన్న జస్టిస్ రమణ అంతర్జాల అనుసంధానం మెరుగుపరచాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. న్యాయ సహాయం, సేవల కోసం.. ప్రత్యేకంగా తీసుకొచ్చిన యాప్‌ను జస్టిస్ రమణ.. సహచర న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా దేశంలో ఏ మూల నుంచైనా క్షణాల్లో న్యాయ సహాయం పొందవచ్చని జస్టిస్ రమణ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 8, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.