ETV Bharat / bharat

బీజాపుర్​ భీకర దాడి వెనుక ప్రణాళిక హిడ్మాదే!

author img

By

Published : Apr 5, 2021, 6:55 AM IST

Updated : Apr 5, 2021, 7:35 AM IST

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లోని అడవుల్లో భద్రతా దళాలపై జరిగిన భీకరదాడికి సూత్రధారి.. సుకుమా జిల్లా పువర్తి ప్రాంతానికి చెందిన హిడ్మాగా అనుమానిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలో జరిగిన భారీ దాడుల్లో చాలావరకు ఇతడి ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా ఉన్నట్లు తెలుస్తున్న హిడ్మా తలపై రూ.40 లక్షల రివార్డు ఉంది.

Chhattisgarh encounte
బీజాపుర్​ భీకర దాడి వెనుక ప్రణాళిక హిడ్మాదే!

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్‌ జిల్లా తరెంలో సీఆర్​పీఎఫ్​పై భీకరదాడికి సూత్రధారి హిడ్మాగా అనుమానిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో భారీ దాడులకు వ్యూహకర్తగా పేరున్న అతడు ప్రస్తుతం పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) నంబర్‌ 1 బెటాలియన్‌కు కమాండర్‌గా, ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) సభ్యుడిగా ఉన్నాడు. రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలో జరిగిన భారీ దాడుల్లో చాలావరకు ఇతడి ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

hidma
హిడ్మా

మెరుపు వేగంతో దాడులు

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పువర్తి ప్రాంతానికి చెందిన గిరిజనుడు హిడ్మా. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ)లో చేరాడు. ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రమే పూర్తి చేసిన అతడు.. మావోయిస్టు ఆపరేషన్లలో దిట్టగా పేరొందాడు. యుద్ధ నైపుణ్య మెలకువలను కేడర్‌కు అలవోకగా నూరిపోస్తుంటాడనే పేరుంది. కూంబింగ్‌ ఆపరేషన్లు నిర్వహించే పోలీస్‌ బలగాలపై, సీఆర్​పీఎప్​ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. పార్టీలో పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) విభాగం ఇతడి కనుసన్నల్లోనే పనిచేస్తుంది.

తలపై రూ.40 లక్షల రివార్డు

దేశీయ ఆయుధాల్ని, ఐఈడీ బాంబుల్ని తయారు చేయడంలో పట్టు కలిగి ఉన్న హిడ్మాను ఒక దశలో పార్టీ కేంద్ర కమిటీలో తీసుకోవాలనే చర్చ జరిగింది. వయసు ఇంకా నాలుగు పదుల్లోనే ఉండటం.. దాడుల్లో దూకుడుగా వ్యవహరిస్తుండటం వల్ల పార్టీ వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని నిఘావర్గాలకు సమాచారం అందింది. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా ఉన్నట్లు తెలుస్తున్న హిడ్మా తలపై రూ.40 లక్షల రివార్డు ఉంది. గతంలో భాజపా ఎమ్మెల్యే భీమా మడవి హత్య కేసులో ఎన్‌ఐఏ అతనిపై అభియోగపత్రం నమోదు చేసింది. శనివారం నాటి దాడిలో దాదాపు 250 మంది ఉన్న పీఎల్‌జీఏ బెటాలియన్‌కు హిడ్మా నేతృత్వం వహించాడని నిఘా వర్గాల కథనం.

ఇదీ చూడండి:బీజాపుర్​ ఎన్​కౌంటర్​ అమరులకు ఫ్రాన్స్ సంతాపం

Last Updated : Apr 5, 2021, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.